పవన్ కళ్యాణ్ 25వ చిత్రమైన ‘అజ్ణాతవాసి’ జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలై డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. నిర్మాత రాధాకృష్ణ సినిమాను ముందే అమ్మేయడం పుణ్యమా అని నష్టాల నుంచి తప్పుకొన్నా.. సినిమాను భారీ ధరలకు కొన్న డిస్ట్రిబ్యూటర్లు మాత్రం దాదాపు రోడ్డునపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగు సినిమా చలనచిత్ర చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా 75 కోట్ల భారీ నష్టాన్ని చవిచూసింది “అజ్ణాతవాసి” చిత్రం. దాంతో నిర్మాత రాధాకృష్ణ, దర్శకుడు త్రివిక్రమ్ డిస్ట్రిబ్యూటర్ల నష్టాల్ని పూడ్చేందుకు ముందుకొచ్చారు. డిస్ట్రిబ్యూటర్స్ దాదాపు 120 కోట్ల రూపాయలకి “అజ్ణాతవాసి” చిత్రాన్ని కొనుగోలు చేయగా.. మొత్తం కలిపి ఇప్పటివరకూ 60 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. దాంతో దాదాపు 70 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాధాకృష్ణ-త్రివిక్రమ్ ల సహాయంతో నష్టం 30 కోట్లకి చేరింది.
అయితే.. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ ని కూడా రెమ్యూనరేషన్ లో కొంతైనా వెనక్కి ఇవ్వమని నిర్మాత ప్రాధేయపడగా చాలా సింపుల్ గా పవన్ కళ్యాణ్ “నో” చెప్పేశాడట. పైగా.. “రాధాకృష్ణ నిర్మాణంలో రూపొందిన మునుపటి సినిమా “అ ఆ” సినిమాని 40 కోట్లకి కొన్నవారు “అజ్ణాతవాసి”ని 120 కోట్లకు కొన్నారంటే అందుకు కారణం సినిమాకి ఉన్న క్రేజ్, అయినా ఆస్థాయిలో బిజినెస్ జరిగినప్పుడు లాస్ వచ్చే రిస్క్ పుష్కలంగా ఉందనే విషయం కూడా డిస్ట్రిబ్యూటర్స్ గుర్తించాలి. అయినా నేను నా అభిమానులకు మాత్రమే సమాధానం చెప్పాలి, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు కాదు” అంటూ కాస్త ఘాటుగా సమాధానమిచ్చాడట. దాంతో నిర్మాత రాధాకృష్ణకి దిమ్మ తిరిగిందట. ఏం చేయాలో పాలుపోక ఎన్టీయార్ హీరోగా తాను నిర్మిస్తున్న తదుపరి చిత్రం రైట్స్ ను తక్కువ రేట్ కి ఇస్తానని ప్రామిస్ చేసి డిస్ట్రిబ్యూటర్ల దగ్గర పరువు నిలబెట్టుకొన్నాడట. పవన్ కళ్యాణ్ గతంలోనూ “సర్దార్ గబ్బర్ సింగ్” డిస్ట్రిబ్యూటర్స్ లాస్ విషయాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు “అజ్ణాతవాసి” విషయంలోనూ అదే ధోరణిలో వ్యవహరిస్తుండడం ఆయన రాజకీయ భవిష్యత్ కు ఏమాత్రం మంచిది కాదు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.