తమిళ స్టార్ హీరో విజయ్, మురుగదాస్ కలయికలో వచ్చిన తుపాకీ, కత్తి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వీరిద్దరి కాంబోలో తాజాగా తెరకెక్కిన మూవీ “సర్కార్”. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో వల్లభనేని అశోక్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు హక్కులు కొనుగోలుచేశారు. దీపావళి కానుకగా నవంబర్ 6న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ మూవీ విడుదల ప్రస్నార్ధకంగా మారింది. ప్రస్తుతం ఈ మూవీపై కోర్టు కేసు నడుస్తోంది. ఏ.ఆర్.మురుగదాస్ తన కథను కాపీ కొట్టారంటూ వరుణ్ రాజేంద్రన్ అనే రచయిత మద్రాస్ హైకోర్టుకు ఫిర్యాదు చేశారు.
2007లోనే సౌతిండియన్ ఫిలిం రైటర్స్ అసోసియేషన్ లో “సెంగోల్” అనే కథను రిజిస్టర్ చేయించానని, ఆ కథను మురుగదాస్ కాపీ కొట్టి “సర్కార్” పేరుతో సినిమా తీసేశారని రాజేంద్రన్ ఆరోపించారు. దీనిపై రైటర్స్ అసోసియేషన్ లోనూ విచారణ నడుస్తోంది. కథ కాపీ కొట్టినందుకు మురుగదాస్, కళానిధి మారన్ బృందం తనకు 30లక్షలు చెల్లించాల్సిందేనంటూ సదరు రచయిత హైకోర్టులో కేసు వేయడంతో న్యాయ విచారణ సాగుతోంది. తనకు పారితోషికం ముట్టే వరకూ రిలీజ్ ఆపాల్సిందిగానూ రాజేంద్రన్ కోర్టులో వాదిస్తున్నారు. దీంతో కోర్టు తీర్పు వచ్చేవరకు “సర్కార్” రిలీజ్ ఆగుతుందా? లేకుంటే రచయితతో రాజీ కుదుర్చుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.