ఈ నాటకం రస్టిక్ గా ఉంది కానీ కంటెంట్ కనిపించడం లేదు

సినిమా ఇండస్ట్రీ అనే కాదు ఏ ఇండస్ట్రీలో అయినా సక్సెస్ ఫార్ములాను గుడ్డిగా ఫాలో అయిపోవడం అనేది సర్వసాధారణం. కానీ.. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ ఫాలో అవ్వడం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకు నిదర్శనం ఇటీవల విడుదలైన కొన్ని సినిమాల ట్రైలర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్లు. మొన్నామధ్య వచ్చిన “రథం” అనే చిత్రంలో హీరోహీరోయిన్లు అదేదో జిమ్నాస్టిక్స్ చేస్తున్నట్లుగా ముద్దు పెట్టుకొని రచ్చ రచ్చ చేశారు. ఇటీవల విడుదలైన ఆర్జీవి “భైరవ గీత”లో కూడా వయొలెన్స్ తో సమానమైన రొమాన్స్ పుష్కలంగా ఉంది. దాంతోపాటు ట్రైలర్ చివర్లో ఒక ఘాఢమైన ముద్దు ఉండడంతో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆ ట్రైలర్ కి బాగానే కనెక్ట్ అయ్యారు.

అయితే.. ఈ పంధాను పిచ్చోళ్లలా ఫాలో అయిపోతున్నారు కొంతమంది జనాలు. “పటాస్” సినిమాలో కుర్ర విలన్ గా నటించిన ఆశీష్ గాంధీ హీరోగా పరిచయమవుతూ నటించిన చిత్రం “నాటకం”. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన రస్టిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ఇవాళ విడుదలైంది. టీజర్ ను దాదాపు 80% రొమాన్స్ తో, మిగతా 20% వయొలెన్స్ తో నింపేసిన ఈ “నాటకం” టీజర్ చూస్తుంటే.. అర్జున్ రెడ్డి, ఆర్.ఎక్స్ 100 సినిమాల ప్రోద్భలం తారాస్థాయిలో కనిపిస్తోంది. అయితే.. ముద్దులు, శృంగార సన్నివేశాలు ఉన్నంతమాత్రాన ప్రతి సినిమా అర్జున్ రెడ్డి అవ్వడు, ప్రతి చిత్రం “ఆర్ ఎక్స్ 100″లా సూపర్ హిట్ అవ్వదు. ఈ విషయాన్ని ఈ కొత్త దర్శకనిర్మాతలు ఎప్పుడు అర్ధం చేసుకొంటారో ఏమో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus