ఈసారి యాక్షన్ ఇమేజ్ పక్కా – నాగచైతన్య

ముందునుండీ నాగచైతన్యకి యాక్షన్ సినిమాలంటే మహా ఇష్టం. అయితే అతగాడికి విజయాలు అందిస్తున్నది మాత్రం ప్రేమకథాచిత్రాలే. తొలి విజయం ‘ఏ మాయ చేశావే’ మొదలు తాజా చిత్రమైన ‘ప్రేమమ్’ వరకు బాక్సాఫీస్ వద్ద అతడిని గెలిపించింది ప్రేమే. తన యాక్షన్ ముచ్చట తీర్చుకునేందుకు చైతూ ‘దడ’, ‘బెజవాడ’, ‘తడాఖా’ వంటి ప్రయత్నాలు చేయగా కాస్తో కూస్తో ఊరటనిచ్చింది ‘తడాఖా’ ఒక్కటే. ఓ రకంగా చై తొలి చిత్రం ‘జోష్’ కూడా యాక్షన్ హంగులతో నిండినదే. గత ఫలితాల మాట ఎలా ఉన్నా ఈ నెల 11న తెరమీదికి రానున్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో తన కల నెరవేరుతుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు ఈ అక్కినేని హీరో.

‘ఏ మాయ చేశావే’ సినిమా తర్వాత నాగచైతన్య, గౌతమ్ మీనన్, రెహమాన్ కలయికలో తెరకెక్కిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా నవంబర్ 11న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి చైతూ చెప్పుకొస్తూ “ఓ మామూలు కుర్రాడు తనకెదురైన ఓ ఆపద నుండి ఎలా బయటపడ్డాడు. అందుకు అతడు చేసిన పోరాటం ఏంటి..?” అన్న అంశంతో సినిమా ఉంటుందని అన్నాడు. సినిమాలో పోరాట సన్నివేశాలకు ప్రాధ్యాన్యం ఉందన్న చైతూ ఈ విషయంలో గత సినిమాల ఫలితంతో పోల్చి చూడాల్సిన అవసరం లేదన్నాడు. తన నటనలో మెచ్యూరిటీ లేకనో, కథలో బలం లేకనో ఆ సినిమాల ఫలితాలు తారుమారయ్యాయని తెలిపిన నాగచైతన్య ‘సాహసం..’లో యాక్షన్ సహజంగా ఉంటుందని, ఎక్కడా ఫోర్స్ యాక్షన్ కనపడదని చెబుతూ ఈ సినిమాతో తనకి కొత్త ఇమేజ్ రావడం ఖాయమని అంటున్నాడు. చూద్దాం.. ఇందులో వాస్తవమెంతో..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus