మహేష్ 25 వ మూవీ రేసులో ఆ ముగ్గురు..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ సినిమా ఎవరితో చేస్తారు అనే దానిపై ఫిలిం నగర్ లో బెట్టింగ్ నడుస్తోంది. ప్రస్తుతం ప్రిన్స్ 23 వ మూవీ ని తమిళ దర్శకుడు మురుగ దాస్ తో చేస్తున్నారు. ఇంకా పేరు ఖరారు చేయని ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో వేగంగా జరుగుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ ఫిలిం ని డిసెంబర్ నాటికి కంప్లీట్ చేయాలని చిత్ర బృందం శ్రమిస్తోంది. దీని  తర్వాత మహేష్ చేయనున్న సినిమా కూడా ఓకే అయింది.

వంశీ పైడి పల్లి దర్శకత్వంలో పీవీపీ వారు నిర్మించనున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రారంభం అవుతుందని మహేష్ పుట్టిన రోజు సందర్బంగా అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ తర్వాత చేయనున్న ప్రతిష్టాత్మక 25 వ సినిమా పై పలు వార్తలు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ ముగ్గురు టాప్ దర్శకులతో పని చేయడానికి పలు సందర్భాలలో మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తో ఎప్పటి నుంచో సినిమా చేయాలనీ ప్రిన్స్ అనుకుంటున్నారు. రాజమౌళి కూడా ఇంటర్వ్యూ లో మహేష్ తో సినిమా చేస్తానని చెప్పారు. మూడేళ్ళుగా బాహుబలికి అంకితమైన జక్కన్న దీని తర్వాత మహేష్ ని డైరక్ట్ చేయనున్నట్లు టాక్.

శ్రీమంతుడితో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కొరటాల శివ రీసెంట్ గా సూపర్ స్టార్ కి ఒక కథ వినిపించారని, అది నచ్చడంతో మైత్రి మూవీ బ్యానర్ లోనే వీరి కలయికలో మరో చిత్రం రానున్నదని ప్రచారం మొదలైంది. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే మహేష్ 25 వ మూవీ ఉంటుందని కొంతమంది సినీ వర్గాల వారు చెబుతున్నారు. తన కెరీర్ ని మలుపు తిప్పిన అతడు మూవీ దర్శకుడితోనే సినిమా చేసేందుకు మహేష్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ముగ్గురు దర్శకులు మహామహులే.. మరి అవకాశం ఎవరిని వరిస్తుందో కొన్ని రోజుల్లో తెలిసిపోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus