టిక్ టిక్ టిక్

  • June 23, 2018 / 06:45 AM IST

సౌత్ ఇండియాస్ ఫస్ట్ జాంబీ ఫిలిమ్ అంటూ “మిరుతాన్” (తెలుగులో “యమపాశం”) అనే చిత్రాన్ని తెరకెక్కించిన జయం రవి-శక్తి సౌందర్ రాజన్ బృందం ఈసారి ఏకంగా ఇండియాస్ ఫస్ట్ స్పేస్ ఫిలిమ్ అంటూ రూపొందించిన చిత్రం “టిక్ టిక్ టిక్”. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువదించారు. తమిళ-తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ స్పేస్ థ్రిల్లర్ మన ఇండియన్ ఆడియన్స్ ను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ:
ఇండియాలోనే బెస్ట్ ఎస్కేప్ ఆర్టిస్ట్ వాసు (జయం రవి), బెస్ట్ హ్యాకర్ అప్పు (అర్జునన్), బెస్ట్ మ్యానిపులేటర్ వెంకట్ (రమేష్ తిలక్)లను మున్నార్ లోని మిలటరీ బేస్ కు తీసుకువస్తారు. అసలెందుకు తీసుకొచ్చారా అని ముగ్గురూ తలలు కొట్టుకొంటున్న తరుణంలో ఆర్మీ చీఫ్ మహేంద్రన్ (జయప్రకాష్) & లెఫ్టినెంట్ స్వాతి (నివేతా పెతురాజ్) మరో 7 రోజుల్లో విశాఖపట్నం దగ్గరలో ఓ పెద్ద ఉల్క పడబోతోందని, ఆ ఉల్కను అడ్డుకోవాలంటే.. అంతరిక్షంలోని పరాయిదేశం స్పేస్ సెంటర్ లో ఉన్న మిస్సైల్ వల్లే సాధ్యమవుతుందని చెప్పడంతోపాటు… ఆ స్పేస్ సెంటర్ నుంచి ఆ మిస్సైల్ ను దొంగిలించి, ఆ ఉల్కను పేల్చే బాధ్యతను వాసు & టీం కు అప్పగిస్తుంది ఆర్మీ.
ఈ పనిని వాసు & టీం అంతరిక్షంలో ఎలా నిర్వహించారు. అందుకోసం వాళ్లెదుర్కొన్న ఇబ్బందులేమిటి? చివరికి విజయం సాధించారా లేదా అనేది “టిక్ టిక్ టిక్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు:
ఇంటర్నేషనల్ లెవెల్ ఎస్కేప్ ఆర్టిస్ట్ గా జయం రవి చక్కగా నటించాడు. సెంటిమెంట్ సీన్స్ లో హీరోగారి నటన ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకొంటుంది. అయితే.. క్యారెక్టరైజేషన్ ను ఇంకాస్త ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది.
“మెంటల్ మదిలో” చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన నివేతా పెతురాజ్ ఈ చిత్రంలో కాస్త గ్లామరస్ గా కనిపించడంతోపాటు నటన పరంగానూ ఆకట్టుకొంది. అర్జునన్, రమేష్ తిలక్ ల కామెడీ కాస్త నవ్వించింది. జయప్రకాష్ విలన్ గా పర్వాలేదనిపించుకొన్నాడు.
జయం రవి తనయుడు ఆరవ్ రవి ఈ చిత్రంలో జయం రవి తనయుడిగా నటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కించిన “కన్నయ్య కన్నయ్య” పాటలో జయం రవి-ఆరవ్ రవిల బాండింగ్ వీడియోస్ & ఫోటోస్ ప్లే చేయడం వలన తండ్రీకొడుకుల అనుబంధం సహజంగా కనిపించింది.

సాంకేతికవర్గం పనితీరు:
హాలీవుడ్ సినిమాలతో కంపేర్ చేస్తే కాస్త తక్కువ స్థాయి సినిమా అనిపిస్తుందే తప్ప.. మన ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీకి “టిక్ టిక్ టిక్” అనేది ఒక “గ్రావిటీ” లాంటిదని చెప్పొచ్చు. అయితే.. గ్రాఫిక్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే అవుట్ కాస్త బాగుండేదేమో అనిపిస్తుంది కానీ.. హీరో ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొంటే అప్పటికే సాహసం చేశారనిపిస్తుంది.

దర్శకుడు కథను “ఆర్మగెడాన్” అనే హాలీవుడ్ ఫిలిమ్ నుంచి ఇన్స్పైర్ అయ్యాడని ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది. సో, ఏదో కొత్తగా ఎక్స్ ఫెక్ట్ చేసి సినిమాకి రారు కాబట్టి పెద్దగా నిరాశపడాల్సిన అవసరం లేదు. అయితే.. హీరో ఎస్కేప్ ఆర్టిస్ట్ అనే థీమ్ ను బేస్ చేసుకొని సన్నివేశాలు బాగానే రాసుకొన్నాడు శక్తి సౌందర్ రాజన్. అయితే.. ఎగ్జిక్యూషన్ లో పర్ఫెక్షన్ లోపించింది. తెరకెక్కించే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. హిస్టారికల్ ఇన్సిడెంట్స్ ను బాగానే యూటిలైజ్ చేసుకొన్నాడు కానీ.. క్లారిటీ ఉంటే బాగుండేది.

డి,ఇమ్మాన్ సంగీతం, ఎస్.వెంకటేష్ సినిమాటోగ్రఫీ, ప్రదీప్ ఎడిటింగ్ బాగున్నాయి. అయితే.. బడ్జెట్ సహరించి ఉంటే ఇంకాస్త బెటర్ అవుట్ పుట్ వచ్చేదని ప్రతి ఫ్రేమ్ లో అర్ధమవుతూనే ఉంటుంది. రెగ్యులర్ గా హాలీవుడ్ మూవీస్ ముఖ్యంగా ఈ తరహా స్పేస్ ఫిలిమ్స్ చూస్తే వారికి మినహా అందరికీ “టిక్ టిక్ టిక్” నచ్చుతుంది.
విశ్లేషణ:
అద్భుతం, అమోఘం అనలేము కానీ.. వారికి కుదిరినంతలో మంచి ప్రయత్నమే చేశారు. ఈ జోనర్ లో మరిన్ని సినిమాలు తెరకెక్కడానికి తోడ్పడ్డారు. అయితే.. “టిక్ టిక్ టిక్” సినిమాగా మాత్రం అన్నీ వర్గాల వారిని ఆకట్టుకొంటుందని చెప్పలేం కానీ.. రెగ్యులర్ మూవీ గోయర్స్ ను మాత్రం అలరిస్తుంది.

రేటింగ్: 2.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus