మెగా మేనల్లుడి చిత్రానికి టైటిల్ ఫిక్స్?

మెగా ఫ్యామిలీ నుండీ వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. మెగా మేనల్లుడు సాయి తేజ్‌ కు స్వయానా తమ్ముడు వైష్ణవ్ తేజ్. ఇటీవల అన్నయ్య సాయి తేజ్ కు మంచి హిట్టిచ్చిన ‘మైత్రీ మూవీ మేకర్స్‌’ సంస్థలోనే వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ‘సుకుమార్‌ రైటింగ్స్‌’ అధినేత సుకుమార్ కూడా ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా బుచ్చిబాబు సానా అనే కొత్త దర్శకుడు పరిచయమవ్వుతున్నాడు. బుచ్చిబాబు గతంలో సుకుమార్‌ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశాడు. సుకుమార్- రాంచరణ్ బ్లాక్ బస్టర్ హిట్.. ‘రంగస్థలం’ చిత్రానికి కూడా రైట‌ర్‌గా పనిచేశాడు.

ఇక ఈ చిత్రానికి ఇండస్ట్రీలోని టాప్ టెక్నీషియన్స్ పని చేస్తుండటంతో పాటూ తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండడం విశేషం. ‘రాక్ స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రం జాలర్ల జీవితానికి సంబందించిన కథాంశంతో తెరకెక్కుతుంది కాబట్టి మొదట ‘జాలరి’ అనే టైటిల్ అనుకుంటున్నట్టుగా వార్తలొచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘ఉప్పెన’ అనే టైటిల్ ను ఖరారు చేశారట. పక్కా మాస్ టైటిల్ కాబట్టి మెగా ఫ్యాన్స్ ఖుషీ అవ్వడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోందట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus