Tollywood: అప్పుడు అలా అన్నారు.. ఇప్పుడు స్పందించరేం!

  • November 25, 2021 / 11:35 PM IST

వడ్డించేవాడు మన వాడు అయితే కావల్సినంత తినొచ్చు… ఈ సామెత గురించి మీరు వినే ఉంటారు. దీన్ని మరో విధంగా కూడా చెప్పొచ్చు. వడ్డించేవాడు మన వాడైతే… వంట బాగోలేకపోయినా వంక పెట్టకూడదు. ఈ మాట మేం అనడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విషంయలో టాలీవుడ్‌ సంఘ సంస్కర్తలు చూపిస్తున్న అమిత ప్రేమ అనిపిస్తోంది. ఒకప్పుడు ఇండస్ట్రీ మంచి కోసం, ఇండస్ట్రీ జనాల మంచి కోసం అంటూ ప్రభుత్వాల మీద, ప్రభుత్వ పెద్దల మీద విమర్శలు చేసిన ఇండస్ట్రీ ముఖ్యులు… ఇప్పుడు టాలీవుడ్‌ భవిష్యత్తు ఇబ్బందుల్లో ఉందని తెలుస్తున్నా కిక్కురు మనకుండా కామ్‌గా ఉన్నారని సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఎవరా ఇండస్ట్రీ ముఖ్యులు అనేగా మీ ఆలోచన. ఒకరు కాదు, ఇద్దరు కాదు… చాలామందే ఉన్నారు. అందులో ఏ ఒక్కరు ఇప్పుడు స్పందించినా… ప్రభుత్వం నుండి స్పందన వస్తుందేమో చూడాలి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఏమాత్రం బాగోలేదని పరిశ్రమ పెద్దలు చిరంజీవి లాంటివాళ్లే చెబుతున్నారు. అయినా గతంలో గొంతులు చించుకుని పరిశ్రమ బాగు కోసం అమితమైన ప్రేమ చూపించిన ఎంతో మంచి సినిమా వాళ్ల నుండి ఇప్పుడు ఎలాంటి చప్పుడు లేదు.

ఏంటీ అభాండాలు అనుకుంటున్నారా? అయితే ఒకసారి గూగుల్‌లోకి వెళ్లి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రకటిస్తున్న పురష్కారాలు లాంటి వాటి గురించి సెర్చ్‌ చేయండి మీకే తెలుస్తుంది. ఉదాహరణకు మీకు కొన్ని గుర్తు చేద్దాం. ‘ఇవి నంది అవార్డులు కావు సైకిల్‌ అవార్డులు’ అంటూ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ గతంలో అన్నారు. పోసాని అయితే అవార్డులకు వర్గం రంగు పూశారు. గుణశేఖర్‌ లాంటివాళ్లు అయితే ‘రుద్రమదేవి’ సినిమా సమయంలో ఏకంగా కుట్ర జరిగింది అన్నారు. వీళ్లు కొంతమంది మాత్రమే. ఆ రోజుల్లో ఇలాంటి విమర్శలు చేసిన వాళ్లు చాలామందే ఉన్నారు.

అవార్డులు ఇస్తున్నారా, కావాల్సిన వారికి పంచుతున్నారా అంటూ కొంతమంది సినిమా జనాలు ఆ రోజుల్లో అడిగారు. కానీ ఇప్పుడు ఏకంగా టాలీవుడ్‌ కష్టాల్లో ఉన్నా వాళ్లు స్పందించడం లేదు. ఏపీ సినిమాటోగ్రఫీ చట్టానికి ప్రభుత్వం సవరణలు చేసింది. దీని వల్ల బెనిఫిట్‌ షోలు వేయడం అంత సులభం కాదు. అలాగే ప్రభుత్వ ఆన్‌లైన్‌ బుకింగ్‌ వస్తుంది. దీని వల్ల టాలీవుడ్‌కి చాలా నష్టం అని పెద్దలు చెబుతున్నారు. అయితే వీటిపై బహిరంగంగా నాటి ‘పెద్ద నోళ్లు’ ఇప్పుడు మాట్లాడటం లేదు.

మొన్నీ మధ్య చిరంజీవి ఓ సభలో మాట్లాడుతూ ‘ప్రభుత్వాలు పురస్కారాలు మరచిపోయాయి’ అంటూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు చురక అంటించారు కూడా. కనీసం పురస్కారాల విషయంలో అయినా ఆ ‘పెద్ద నోళ్లు’ మాట్లాడాయా అంటే లేదనే చెప్పాలి. పోనీలే అవార్డుల కోసం ఎందుకు అనుకున్నారో ఏమో. కనీసం పరిశ్రమ కష్టం చూసైనా స్పందించొచ్చు కదా. అప్పుడు పరిశ్రమ మీద ఉన్న ప్రేమ ఇప్పుడు లేకుండా పోయిందా? లేక ప్రభుత్వం మీద ఉన్న అతి ప్రేమను… పరిశ్రమ మీద ఉన్న ప్రేమను కప్పేసిందా? అనేది తెలియడం లేదని నెటిజన్లు అంటున్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus