తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ‘విక్రమార్కుడు’, ‘మర్యాదరామన్న’, ‘గబ్బర్ సింగ్’, ‘ఛలో’, ‘అమీ తుమీ’ సహా పలు చిత్రాలలో హాస్యనటుడిగా మెప్పించిన కోసూరి వేణుగోపాల్ బుధవారం రాత్రి కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మృతి చెందారు. సినీ ప్రముఖులు సహా పలువురు ప్రేక్షకులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే…. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణానికి చెందిన కోసూరి వేణుగోపాల్ సుమారు 30 సంవత్సరాలుగా తెలుగు చిత్రాలలో నటిస్తున్నారు. ‘తెగింపు’ చిత్రంతో దర్శకుడు పీఎన్ రామచంద్ర రావు ఆయన నటుడిగా పరిచయం చేశారు. ఒకవైపు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తూనే… మరోవైపు సినిమాలలో నటించారు వేణుగోపాల్. నటన అంటే ఆయనకు అంత ఆసక్తి.
సునీల్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మర్యాద రామన్న’ చిత్రం కోసూరి వేణుగోపాల్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. రాజమౌళి తీసిన ‘విక్రమార్కుడు’లోనూ ఆయన నటించారు. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘గబ్బర్ సింగ్’లో కోసూరు వేణుగోపాల్ చిన్న వేషం వేసినప్పటికీ… విలన్ అభిమన్యు సింగ్ తో డీల్ చేసే సన్నివేశంలో రాజకీయ నాయకుడిగా మెప్పించారు. నాగ శౌర్య ‘ఛలో’ చిత్రంలో హాస్యనటుడు వెన్నెల కిషోర్ తండ్రి పాత్రలో ప్రేక్షకుల్ని నవ్వించారు. నాగచైతన్య కథానాయకుడిగా నటించిన ‘ప్రేమమ్’లో హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి తండ్రిగా… కుమారుడికి పెళ్లి సంబంధాలు చూసే సన్నివేశాల్లో భార్య మాట భర్త పాత్రలో ఆయన అభినయం అందరినీ ఆకట్టుకుంది. పలు చిత్రాలలో కోసూరు వేణుగోపాల్ నటించారు. ప్రేక్షకుల్ని నవ్వించారు.
ఉద్యోగానికి రాజీనామా చేసిన అనంతరం కోసూరి వేణుగోపాల్ సినిమాలపై పూర్తిగా దృష్టి సారించారు. ఈనెల ఒకటో తారీఖున కరోనాతో గచ్చిబౌలిలోని ఒక ఆసుపత్రిలో ఆయన చేరారు. కొన్ని రోజులుగా వెంటిలేటర్ ద్వారా ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ కోలుకోలేదని కుటుంబ సభ్యులు తెలియజేశారు. గత 23 రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆయన, బుధవారం రాత్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మృతి పట్ల దర్శకుడు హరీష్ శంకర్, హాస్యనటులు బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Most Recommended Video
‘బిగ్‌బాస్’ దివి గురించి మనకు తెలియని నిజాలు..!
తమకు ఇష్టమైన వాళ్ళకు కార్లను ప్రెజెంట్ చేసిన హీరోల లిస్ట్..!
ఇప్పటవరకూ ఎవ్వరూ చూడని బిగ్ బాస్ ‘అభిజీత్’ ఫోటో గ్యాలరీ!