Director Madan: సినీ పరిశ్రమలో విషాదం..టాలీవుడ్ దర్శకుడు మదన్ హఠాన్మరణం..!

గతకొద్ది రోజులుగా వరుస మరణాలు చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నాయి.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు పలు కారణాల వల్ల మరణించారు. దీంతో, ఏ క్షణాన ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని కంగారు పడుతున్నారు సినిమా పరిశ్రమ వర్గాలవారు.. ఇక సెలబ్రెటీలు వరుసగా కన్ను మూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగి పోతున్నారు..

సూపర్ స్టార్ కృష్ణ గారి మరణవార్త మర్చిపోకముందే.. తెలుగు ఇండస్ట్రీ ఓ టాలెంటెడ్ డైరెక్టర్‌ని కోల్పోయింది.. దర్శకుడు మదన్ ఆకస్మిక మరణం చెందారు. ఆయనకు నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ శనివారం (నవంబర్ 19) సాయంత్రం కన్నుమూశారు.

ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని మదనపల్లి ఆయన స్వస్థలం.. మదన్ పూర్తి పేరు రామిగాని మదన్ మోహన్ రెడ్డి.. ఆర్ ఆర్ మధు అని కూడా పిలిచేవారు. రాజేంద్ర ప్రసాద్ ‘ఆనలుగురు’ చిత్రంతో రచయితగా పరిచయమయ్యారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారాయన. జగపతి బాబు, ప్రియమణిల ‘పెళ్లైన కొత్తలో’ మూవీతో దర్శక నిర్మాతగా జర్నీ స్టార్ట్ చేశారు. ఉదయ్ కిరణ్‌తో ‘గుండె ఝల్లుమంది’, జగపతి బాబుతో ‘ప్రవరాఖ్యుడు’, ‘కాఫీ విత్ మై వైఫ్’ (కన్నడ – రైటర్ & ప్రొడ్యూసర్), ఆది సాయికుమార్ ‘గరం’, మోహన్ బాబు ‘గాయత్రి’తో సినిమాలకు దర్శకత్వం వహించారు.

గాయత్రి (2018) మదన్ డైరెక్ట్ చేసిన చివరి చిత్రం. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే షార్ట్ స్టోరీస్ రాసి, డైరెక్ట్ చేస్తుండేవారాయన. కొన్నాళ్లకు సినిమాల్లో ప్రయత్నిద్దామని హైదరాబాద్ వచ్చి.. ప్రముఖ కెమెరామెన్ ఎస్.గోపాల్ రెడ్డి దగ్గర రెండు సంవత్సరాల పాటు అసిస్టెంట్ కెమెరామెన్‌‌గా వర్క్ చేశారు. కొన్ని సినిమాలకు కో-రైటర్‌గా చేస్తుండగా.. ‘ఆనలుగురు’ అవకాశం వచ్చింది.. రైటర్, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్‌గా అభిరుచిని చాటుకున్న మదన్ ఆకస్మిక మరణం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus