ఒకే తేదీకి రెండు, మూడు సినిమాల రిలీజ్ అనౌన్స్ చేయడం.. ఆ తర్వాత ఒకరు పోరు నుండి వెనక్కి వెళ్లడం అనేది మనం చాలా ఏళ్లుగా టాలీవుడ్‌లో చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి పండగల లాంటి పెద్ద సీజన్లలో ఉండేది. ఇప్పుడు నార్మల్ డేట్‌లకు, లాంగ్ వీకెండ్‌లకు కూడా వస్తోంది. అయితే బరిలో నిలిచిన సినిమాల్లో ఏదో ఒకటి వాయిదా పడుతోంది. దీంతో ‘వాయిదాల వ్యవహారం’ కంటిన్యూ అవుతోంది. అలా ఆగస్టు ఆఖరు, సెప్టెంబరు మొదటి వారం సినిమాలు వాయిదాలు పడ్డాయి. దీంతో మిగిలిన సినిమాలకు లాభం చేకూరేలా కనిపిస్తోంది.
తొలుత లాభపడే సినిమాల సంగతి చూసి.. ఆ తర్వాత ఆ అవకాశం ఇచ్చిన సినిమాల గురించి చూద్దాం. వినాయక చవితి కానుకగా ఈ నారా రోహిత్ ‘సుందర కాండ’ సినిమా విడుదలైంది. దీంతోపాటు ఇంకో కాస్త పేరున్న సినిమా రాలేదు. కుటుంబ నేపథ్య సినిమాగా రూపొందిన ఈ సినిమాకు ఈ సీజన్ బాగా కలిసొస్తుంది. ఇక వచ్చే శుక్రవారం అనుష్క – క్రిష్ ‘ఘాటి’ వస్తోంది. ఎన్నో నెలలుగా వాయిదాలు, విమర్శలు అందుకుంటున్న ఆ సినిమాకు ఆ వారం ఎలాంటి పోటీ లేదు. అన్నట్లు శివకార్తికేయన్ – మురుగదాస్ సినిమా ‘మదరాశి’ కూడా అదే డేట్‌కి వస్తోంది. ఇలా ఈ మూడు సినిమాలు బెనిఫిట్ పొందుతున్నాయి.
ఇక ఈ అవకాశం ఇచ్చిన సినిమాలేంటి అని చూస్తే.. రవితేజ – శ్రీలీల కాంబోలో రూపొందుతున్న ‘మాస్ జాతర’. ఈ సినిమాను ఆగస్టు 27నే రావాల్సి ఉన్నా.. ‘చాలా’ కారణాల వల్ల రాలేదు. ఇక టీజర్‌తో అంచనాలను పెంచిన తేజ సజ్జా – మంచు మనోజ్ సినిమా ‘మిరాయ్’ని సెప్టెంబరు 5న తెస్తామన్నారు. కానీ ఇప్పుడు సెప్టెంబరు 12కి తీసుకెళ్లిపోయారు. ఇలా ఈ రెండు సినిమాలు ఆ మూడు సినిమాలకు ప్లస్ అయ్యేలా చేశాయి. మరి వచ్చిన ఈ గోల్డెన్ అవకాశాన్ని ఆ సినిమాలు ఎలా సద్వినియోగం చేసుకుంటాయో చూడాలి.