తెలుగు సినిమాల్లో కథానాయకుడి తల్లి పాత్రకు బరువు పెరుగుతోంది. ఈ పాత్రను చేయడానికి ఇది వరకు వెండి తెరపై మెరిసిన తారలు ముందుకు వస్తున్నారు. నటనలో అనుభవం కలిగిన వీరు సినిమా విజయానికి దోహద పడుతున్నారు. అందుకే వీరికి విలువ పెరుగుతోంది. సినిమాలో తల్లుల రెమ్యూనరేషన్ గురించి….
మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జునల పక్కన హీరోయిన్ గా నటించి కుర్రకారుల మది దోచుకున్న అందాల నటి రమ్యకృష్ణ. వయసు పెరిగినా, పెళ్లి అయి, తల్లి అయినా టాలీ వుడ్ లో ఈమెకు క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ ప్రముఖ పాత్రలో నటిస్తూ బిజీగా ఉన్నారు. బాహుబలి, సోగ్గాడే చిన్నినాయన సినిమాల్లో హీరో తల్లిగా నటించి మెప్పించారు. బాహుబలిలో శివగామి పాత్రలో ఇమిడి పోయారు. ఈమె రోజుకు రూ.2 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటూ టాప్ పొజిషన్లో ఉన్నారు.
తెలుగు తొలి తరం హీరోల పక్కన కథానాయికగా నటించి, సహజ నటిగా పేరు తెచ్చుకున్న జయసుధ తల్లి పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేస్తున్నారు. అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి, బొమ్మరిల్లు సినిమాల్లో హీరో తల్లిగా అద్భుత నటనను ప్రదర్శించారు. అక్కడ నుంచి అనేక సినిమాల్లో అమ్మ పాత్రలను పోషించారు. ఈమె సినిమాకు రూ.20 లక్షలు, లేదా రోజుకు రూ. లక్ష చొప్పున రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
పాతికేళ్ల క్రితం మలయాళం, తమిళం సినిమాల్లో నదియా హీరోయిన్ గా చేసారు. మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అప్పుడు తెలుగులో బజారు రౌడీ, వింత దొంగలు చిత్రాలు చేసినా తెలుగు సినీ అభిమానులకు చేరువ కాలేక పోయారు. కాని ఆమె సెకండ్ ఇన్నింగ్స్ తెలుగు పరిశ్రమలో దూసుకు పోతోంది. మిర్చి సినిమాలో ప్రభాస్ తల్లిగా ఆకట్టుకున్నారు. అత్తారింటికి దారేదిలో టైటిల్ రోల్ పోషించారు. ఇలా బ్రూస్లీ, అ.. ఆ సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించారు. ఈమె రోజుకు రూ. 2 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
సీనియర్ నటి రేవతి దక్షిణాది భాషలతో పాటు, హిందీలోనూ నటించారు. సినిమాలకు దర్శకత్వం వహించడం తో పాటు బుల్లితెరలోనూ అనేక కార్యక్రమాలు చేసారు. ఆమె నటనకు స్కోప్ ఉండే పాత్రలనే ఎంచుకుంటుంది. ఈ మధ్య తెలుగులో లోఫర్ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి తల్లిగా నటించారు. బ్రహ్మోత్సవం చిత్రంలో సూపర్ స్టార్ అమ్మగా మెప్పించారు. రేవతి సినిమాకు రూ. 15 – 20 లక్షల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
రోజా సినిమాతో అందరికి పరిచయమైన హీరోయిన్ మధుబాల. బాలీవుడ్ లో అనేక హిట్ సినిమాలు చేసింది. తెలుగు, తమిళ్ సినిమాల్లోనూ కథానాయికగా నటించింది. ఈమె ప్రస్తుతం తల్లి పాత్రల ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. సూర్య వర్సెస్ సూర్య సినిమాలో నిఖిల్ కి అమ్మగా చక్కని నటన ప్రదర్శించింది. ఈమె రోజుకు రూ. 75 వేలు చొప్పున తీసుకుంటోంది.
2003 లో విడుదలైన గంగోత్రి సినిమా నుంచి మొన్న హిట్ అందుకున్న నేను శైలజ సినిమా వరకు దాదాపు 80 సినిమాల్లో హీరో/హీరోయిన్ అమ్మగా కనిపించిన నటి ప్రగతి. ఈమె రోజుకు రూ.40 వేలు అందుకుంటున్నారు. గతంలో ఈమె ఆరు తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
వీరితో పాటు అలా మొదలయింది సినిమాతో అమ్మ పాత్రలో కనిపించిన రోహిణి రోజుకు రూ.50-60 వేలు అందుకున్నారు. అలాగే సన్నాఫ్ సత్యమూర్తి, రేసు గుర్రం సినిమాల్లో తల్లిగా నటించిన పవిత్ర లోకేష్ రోజుకు రూ.50-60 వేలు తీసుకుంటున్నారు.