సెన్సార్ కత్తికి ఈ సినిమాల తలరాతే మారిపోయింది..!

ఒక సినిమాని మొదలు పెట్టినప్పటి నుండీ రిలీజ్ చేసే వరకూ.. మధ్యలో దర్శక నిర్మాతలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అనుకున్న షెడ్యూల్ కు సినిమాని పూర్తిచెయ్యాలి.. మధ్యలో ఫైనాన్స్ సమస్య ఏర్పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా మొత్తం మొదటికి వస్తుంది అనడంలో సందేహం లేదు. అంతా చేసి సినిమా విడుదల చేద్దాం అనుకుని సెన్సార్ గుమ్మం తొక్కితే.. అక్కడ కూడా ఈ టైటిల్ అభ్యంతరకరం ఉంది, సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయి, వివాదాలు పెంచేలా ఉన్నాయి.. అనే కామెంట్స్ వస్తే.. ఆ దర్శక నిర్మాతలకి ఇక నిద్రపడుతుందా. తమ సినిమాని ఎలా విడుదల చేయాలని కంటి మీద కునుకు లేకుండా తిరుగుతుంటారు. అలా ఈ 2019 లో సెన్సార్ వల్ల ఇబ్బంది పడ్డ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ఎన్టీఆర్ మహానాయకుడు : మహా నటుడు, దివంగత నేత అయిన ఎన్టీ రామారావు జీవిత చరిత్రతో రెండు సినిమాలు రూపొందించారు. ఒకటి ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మరొకటి ‘ఎన్టీఆర్ మహానాయకుడు’. వీటిలో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ విషయంలో పెద్దగా అభ్యంతరాలు రాలేదు కానీ.. ఎన్టీఆర్ రాజకీయ జీవిత చరిత్రతో రూపొందిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రం విషయంలో మాత్రం సెన్సార్ బోర్డు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది.

2) లక్ష్మీస్ ఎన్టీఆర్ : వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన రాంగోపాల్ వర్మ.. అసలు ఎన్టీఆర్ బయోపిక్ నేను తీస్తున్నాను. నా సినిమాలో నిజాలు ఉన్నాయి అంటూ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదలకు ఎన్నో తిప్పలు పడింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఉండడంతో ఈ చిత్రాన్ని అక్కడ విడుదల కానివ్వలేదు. ఇక సెన్సార్ సభ్యులు కూడా ఈ చిత్రానికి చాలా అభ్యంతరాలు చెప్పి.. అవన్నీ మార్చిన తరువాతే క్లియరెన్సు ఇచ్చింది.

3) మన్మధుడు 2 : నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలకు సెన్సార్ వారు అభ్యంతరాలు చెప్పారు. అందులో ఝాన్సీకి హీరోయిన్ రకుల్ లిప్ లాక్ వంటి సన్నివేశాలకి బ్లర్ చేశారు.

4) ఎవరు : అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర .. ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో కూడా కొన్ని సన్నివేశాలకు సెన్సార్ వారు అడ్డు చెప్పారు.

5) సాహో : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ‘సాహో’ చిత్రంలో కూడా కొన్ని పదాలని మ్యూట్ చేయడం, అలాగే హీరో సిగార్ తో రౌడీ కంటి మీద కాల్చే సన్నివేశాన్ని కూడా తొలగించారు.

6) నానీస్ గ్యాంగ్ లీడర్ : ఈ చిత్రానికి టైటిల్ విషయంలో చాలా గొడవైంది. సెన్సార్ బోర్డ్ ఆఫీస్ లో కేసు కూడా ఫైల్ అయ్యింది. దీంతో ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ గా మర్చి విడుదల చేశారు.

7) గద్దలకొండ గణేష్ : వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రానికి మొదట ‘వాల్మీకి’ అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఓ వర్గం నుండీ అభ్యంతరాలు రావడం.. సెన్సార్ వారు కూడా అడ్డుచెప్పడంతో టైటిల్ మార్చారు.

8) 90 ఎం.ఎల్ : ‘ఆర్.ఎక్స్.100′ హీరో కార్తికేయ నటించిన ’90 ఎం.ఎల్’ చిత్రానికి కూడా సెన్సార్ బోర్డు వారు అభ్యంతరాలు చెప్పారు. ఈ చిత్రం మద్యపానాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉంది అని కొందరు అభ్యంతరాలు తెలిపి నిరసనలకి దిగడంతో .. సెన్సార్ పూర్తికాలేదు. కొన్ని మార్పులు చేసి ఒక రోజు లేట్ గా సినిమా విడుదలయ్యేలా చేశారు నిర్మాతలు.

9) ఏడు చేపల కథ : శృంగారం శృతిమించడంతో ఈ చిత్రంలో చాలా సన్నివేశాలను సెన్సార్ వారు తొలగించి.. రివైజింగ్ టీం కి పంపి.. ఆ తరువాత క్లియరెన్సు ఇచ్చింది.

10) అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు : మళ్ళీ వర్మ మార్క్ వివాదమే..! 2019 లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసిన తరువాత చోటుచేసుకున్న కొన్ని రాజకీయ పరిస్థితులను ఆధారం చేసుకుని.. రాంగోపాల్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మొదట ఈ చిత్రానికి ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్ ను అనుకున్నారు. కానీ సెన్సార్ వాళ్ళు అభ్యంతరాలు చెప్పడం.. సినిమాలో కూడా వివాదాలు నెలకొల్పే సన్నివేశాలు ఉన్నాయని.. విడుదల ఆపేసింది. ఈ విషయం పై వర్మ కూడా సెన్సార్ వారి పై నోరు పారేసుకున్నాడు. కిందా మేదా పడి.. చాలా కట్లతో సినిమాని విడుదల చేసాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus