టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ల మధ్య ఇప్పుడు ఒక ఆసక్తికరమైన రేస్ నడుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఎవరు ఎక్కువ ప్రాజెక్టులతో సందడి చేస్తున్నారనే విషయంలో మెగా, నందమూరి హీరోల కంటే ప్రభాస్, అల్లు అర్జున్ ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. వరుసగా మూడు నాలుగు భారీ చిత్రాలను లైన్లో పెట్టి ప్రభాస్, బన్నీ దూసుకుపోతుంటే, రామ్ చరణ్, ఎన్టీఆర్ మాత్రం తమ తదుపరి అడుగుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని నెట్టింట చర్చ మొదలైంది.
ముఖ్యంగా ప్రభాస్ లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆయన చేతిలో ప్రస్తుతం నాలుగు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘కల్కి 2’, ‘సలార్ 2’ వంటి సెన్సేషనల్ సీక్వెల్స్‌తో పాటు హను రాఘవపూడితో ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ చిత్రాలను పట్టాలెక్కించారు. విభిన్న జోనర్లను ఎంచుకుంటూ గ్లోబల్ మార్కెట్‌ను ప్రభాస్ శాసిస్తున్నారు. అటు అల్లు అర్జున్ కూడా అట్లీ, లోకేష్ కనగరాజ్, సందీప్ వంగా వంటి టాప్ డైరెక్టర్లతో సినిమాలు ఫిక్స్ చేసుకుని తగ్గేదేలే అన్నట్టుగా పాన్ ఇండియా రేసులో స్పీడ్ పెంచారు.
మరోవైపు ఆర్ఆర్ఆర్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం ఒక్కో సినిమాపైనే దృష్టి పెట్టారు. చరణ్ ‘పెద్ది’ తర్వాత సుకుమార్ ప్రాజెక్ట్ గురించి ఇంకా మరో అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. అలాగే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నారు, కానీ త్రివిక్రమ్ లేదా ‘దేవర 2’పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. పాన్ ఇండియా మార్కెట్‌లో నిలదొక్కుకోవాలంటే కనీసం రెండు మూడు సినిమాలు చేతిలో ఉండటం అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో చరణ్, తారక్ కాస్త నెమ్మదిగా ఉన్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అయితే ఈ ఇద్దరు హీరోలు క్వాలిటీ కోసం మాత్రమే సమయం తీసుకుంటున్నారని, త్వరలోనే భారీ అనౌన్స్‌మెంట్లతో సర్ ప్రైజ్ ఇస్తారని సినీ వర్గాల సమాచారం. చరణ్ సుకుమార్, ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లు ఒకవేళ సెట్ అయితే బాక్సాఫీస్ లెక్కలు మొత్తం మారిపోవడం ఖాయం. ఏదేమైనా ప్రభాస్, బన్నీ అనుసరిస్తున్న స్పీడ్ ఫార్ములాను చరణ్, ఎన్టీఆర్ కూడా ఫాలో అవుతారో లేదో చూడాలి.