TOLLYWOOD: సంక్రాంతి విందులో అంతా ‘స్వీట్స్’ యేనా? అసలు కిక్ మిస్సవుతోందే!

సంక్రాంతి పండగంటే బాక్సాఫీస్ దగ్గర వెరైటీ విందు భోజనం ఉండాలి. మాస్, క్లాస్, యాక్షన్, సెంటిమెంట్ ఇలా అన్ని రుచులు ఉంటేనే కిక్ ఉంటుంది. కానీ 2026 సంక్రాంతి రేసు చూస్తుంటే మాత్రం.. మన స్టార్ హీరోలందరూ కలిసి ప్రేక్షకుల ప్లేటులో కేవలం ‘కామెడీ’ అనే స్వీట్ మాత్రమే ఎక్కువగా వడ్డిస్తున్నట్లు అనిపిస్తోంది. బరిలో ఉన్న బడా సినిమాలన్నీ దాదాపు ఒకే జోనర్‌లో ఉండటం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తితో పాటు చిన్న ఆందోళనను కూడా రేకెత్తిస్తోంది.

TOLLYWOOD

ముందుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తే, మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘ది రాజా సాబ్’ పక్కా హారర్ కామెడీ అని తెలిసిందే. ఇందులో హారర్ ఉన్నప్పటికీ ఫైనల్ గా కామెడీ డోస్ ఎక్కువే. అటు మెగాస్టార్ చిరంజీవి కూడా అనిల్ రావిపూడితో చేస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో పూర్తి స్థాయి వినోదాన్ని పంచబోతున్నారు. మాస్ రాజా రవితేజ సైతం యాక్షన్ పక్కన పెట్టి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ ఫ్యామిలీ కామెడీతో వస్తున్నారు. ఇక నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ ఎలాగూ నవ్వుల సినిమానే. ఇలా అందరూ నవ్విస్తాం అంటూ ఒకేసారి దండయాత్ర చేస్తే ఎలా?

ఇక్కడే అసలు సమస్య వచ్చే అవకాశం ఉంది. కామెడీ అనేది చాలా సెన్సిటివ్ జోనర్. ఒక సినిమా చూసి నవ్వుకున్న ఆడియన్స్‌కి, రెండో సినిమా కూడా అదే ఫార్మాట్‌లో ఉంటే బోర్ కొట్టే ప్రమాదం ఉంది. పండగ సీజన్‌లో ఫ్యాన్స్ కోరుకునే గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్, కంటతడి పెట్టించే ఎమోషన్ మిస్ అయితే.. ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుంది. అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారేమో కానీ, ఆడియన్స్ మాత్రం వెరైటీ కోరుకుంటారు.

ఈ గ్యాప్ వల్ల డబ్బింగ్ సినిమాలకు అడ్వాంటేజ్ దొరికే ఛాన్స్ ఉంది. మన వాళ్లంతా కామెడీ ట్రాక్‌లో ఉంటే, తమిళ హీరో విజయ్ ‘జన నాయగన్’ అంటూ సీరియస్ పొలిటికల్ యాక్షన్ డ్రామాతో వస్తున్నారు. ఒకవేళ ప్రేక్షకులకు కామెడీ డోస్ ఎక్కువైతే, ఆ సీరియస్ నెస్ కోసం విజయ్ సినిమా వైపు మళ్లే ప్రమాదం లేకపోలేదు. రొటీన్‌కి భిన్నంగా ఉన్న సినిమాకే ఎప్పుడూ పండగ సీజన్‌లో ఎడ్జ్ ఉంటుంది. కాబట్టి ఈసారి సంక్రాంతి విన్నర్ అవ్వాలంటే కేవలం జోకులు పేలితే సరిపోదు. ఆ నవ్వుల వెనుక బలమైన కథ, ఆడియన్స్‌ని కట్టిపడేసే ఎమోషన్ ఎవరి సినిమాలో ఉంటే వాళ్లే బాక్సాఫీస్ దగ్గర మొనగాళ్లు అవుతారు. లేదంటే అన్నీ ఒకేలా ఉన్నాయనే టాక్ వస్తే మాత్రం, ఓపెనింగ్స్ తర్వాత సినిమాలు చల్లబడిపోయే రిస్క్ ఉంది. చూడాలి మరి ఈ ‘నవ్వుల’ యుద్ధంలో ఎవరు గెలుస్తారో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus