“ఇంట గెలిచి రచ్చ గెలవాలి” అనే సామెత మన స్టార్ హీరోలు పెద్దగా పట్టించుకోవడం లేదు. పట్టించుకోకపోతే వాళ్ళే కదా పోయేది మీకేంటి నొప్పి అనుకొంటున్నారా. మాకేం నొప్పి లేదు కానీ.. పాపం తెలుగు రాష్ట్రాల్లో సదరు హీరోల స్టార్ డమ్ చూసి భారీ మొత్తానికి వారి సినిమా ఓవర్సీస్ రైట్స్ ను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కే నొప్పి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, వెంకటేష్ వంటి స్టార్ హీరోలు ఓవర్సీస్ లో భారీ నష్టాలను చవిచూశాయి. ఇక నితిన్, సాయిధరమ్ తేజ్ ల సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంతమంచిది.
పవన్ కళ్యాణ్ “సర్దార్ గబ్బర్ సింగ్” ఓవర్సీస్ రైట్స్ 11 కోట్లకు అమ్ముడవ్వగా.. వసూళ్ల రూపంలో వచ్చింది కేవలం 4.7 కోట్లు మాత్రమే. అలాగే తాజా చిత్రం “కాటమరాయుడు” కూడా 11 కోట్లకు కొనుగోలు చేయగా డిస్ట్రిబ్యూటర్లకి తిరిగొచ్చింది ఆరు కోట్లు మాత్రమే. ఇక మహేష్ బాబు “బ్రహ్మోత్సవం” కొన్నది 11 కోట్లకైతే.. వచ్చింది 5 కోట్లు, “స్పైడర్’ 14 కోట్లకి కొనుగోలు చేయగా ఇప్పటివరకూ నిర్మాతలకు వచ్చింది 5 కోట్లు మాత్రమే. ఇక అల్లు అర్జున్ కెరీర్ లోనే హిట్ గా నిలిచిన “దువ్వాడ జగన్నాధం” ఓవర్సీస్ రైట్స్ 8 కోట్లు పెట్టి కొనుక్కొన్న నిర్మాతలకు సరిగ్గా సగం అనగా 4 కోట్లు మాత్రమే ముట్టాయి. “సరైనోడు” సంగతి కూడా అంతే.. 6 కోట్లు పెట్టి కొన్న సినిమాకి 3 కోట్లు మాత్రమే వెనక్కి వచ్చాయి.