యంగ్ డైరక్టర్ కి ఛాన్స్ ఇస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోలు

  • May 8, 2017 / 02:07 PM IST

ఇది వరకు స్టార్ హీరోని డైరక్ట్ చేయాలంటే చాలా అనుభవం ఉండాలి. కనీసం నాలుగైదు చిత్రాలు అయినా చేసి ఉండాలి. అది కూడా సూపర్ హిట్ అయిఉండాలి. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒక్క సినిమాతో తన మేకింగ్ స్టైల్ చూపించగలిగితే చాలు సీనియర్ హీరోలు సైతం పిలిచి అవకాశం ఇస్తున్నారు. యువ డైరక్టర్స్ దర్శకత్వంలో తాము కొత్తగా కనిపిస్తామని నమ్ముతున్నారు. కొత్త ఆలోచనతో వస్తే చాలు, వారికి ఎంత అనుభవం ఉందని కూడా చూడకుండా వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. అటువంటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలపై ఫోకస్..

చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో చిరంజీవి బ్లాక్ బస్టర్ రీ ఎంట్రీ ఇచ్చారు. రీ ఎంట్రీ కోసం చాలా రోజులు ఆలోచించిన చిరు 151వ సినిమాకి వచ్చే సరికి యువ డైరక్టర్ సురేందర్ రెడ్డి ని తీసుకున్నారు. ‘కిక్’, ‘రేసుగుర్రం’, ‘ధృవ’ చిత్రాల్లో హీరోని స్టైలిష్ గా చూపించిన విధానం నచ్చి అతనికి అవకాశం ఇచ్చారు. వీరిద్దరి కలయికలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ రూపుదిద్దుకోనుంది.

నాగార్జున కెరీర్ బిగినింగ్ లోనే నాగార్జున యువ దర్శకులని ప్రోత్సహించారు. ఇప్పటికీ అదే రూట్ లో వెళుతున్నారు. కొన్ని సార్లు పరాజయాలు ఎదురైనా సరే, యువ దర్శకులపై భరోసాని మాత్రం వదులుకోలేదు. ఇప్పుడు కూడా యువ దర్శకుడు ఓంకార్ తోనే ‘రాజుగారి గది2’ చేస్తున్నారు.

వెంకటేష్ గురు సినిమాలో వెంకటేష్ కొత్తగా కనిపించారు. దానిని యువ దర్శకురాలు సుధ కొంగర డైరక్ట్ చేశారు. ఈ చిత్రానికి వచ్చిన అభినందనలను మనసులో పెట్టుకొని తర్వాత ప్రాజక్ట్ కూడా యంగ్ డైరక్టర్ తో చేయడానికి వెంకటేష్ ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు కొత్త దర్శకులు చెబుతున్న కథల్ని వినడంలో బిజీగా ఉన్నారు.

రవితేజ మాస్ మహారాజ్ రవితేజ కూడా యువ దర్శకులతో కలిసే ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ప్రస్తుతం ‘టచ్ చేసి చూడు’తో పాటు, ‘రాజా ది గ్రేట్’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆ చిత్రాల్ని తెరకెక్కిస్తున్న విక్రమ్ సిరికొండ, అనిల్ రావిపూడి… ఇద్దరూ కూడా యువ దర్శకులే.

ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ డైరక్టర్లు ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. పూరి జగన్నాథ్, సుకుమార్, కొరటాల శివ తదితరులు కథలు కూడా వినిపించారు. అయినా తారక్ మాత్రం యువ దర్శకుడైన బాబీ చెప్పిన కథకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ ఇద్దరి కలయికలో ప్రస్తుతం ‘జై లవకుశ’ తెరకెక్కుతోంది.

అల్లు అర్జున్హరీష్ శంకర్ దర్శకత్వంలో “దువ్వాడ జగన్నాథమ్” సినిమా చేస్తున్న అల్లు అర్జున్, తర్వాత అసలు ఎటువంటి అనుభవం లేని వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ “నా పేరు సూర్య, నా ఊరు ఇండియా” మూవీ చేయబోతున్నారు.

ప్రభాస్ ఎస్.ఎస్.రాజమౌళితో కలిసి బాహుబలి వంటి సినిమా చేసిన ప్రభాస్ తదుపరి వరుసగా యువ దర్శకులతోనే సినిమాలు చేస్తున్నారు. మొదట సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ చేశాక, ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus