Toofan Review in Telugu: తుఫాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • August 9, 2024 / 04:30 PM IST

Cast & Crew

  • విజయ్ ఆంటోనీ (Hero)
  • మేఘ ఆకాష్ (Heroine)
  • ఆర్.శరత్ కుమార్ , సత్యరాజ్, ధనంజయ, మురళీశర్మ తదితరులు.. (Cast)
  • దర్శకత్వం: (Director)
  • కమల్ బోరా - డి.లలిత - బి.ప్రదీప్ - పంకజ్ బోరా (Producer)
  • అచ్చు రాజమణి - విజయ్ ఆంటోనీ - రాయ్ - హరి దుఫాసియా - వఘు మళన్ (Music)
  • విజయ్ మిల్టన్ (Cinematography)

“బిచ్చగాడు 2” (Bichagadu 2) హిట్ తర్వాత మళ్ళీ మూడు వరుస పరాజయాలు చవిచూసిన విజయ్ ఆంటోనీ (Vijay Antony) నటించగా విడుదలైన నాలుగో చిత్రం “తుఫాన్” (Toofan) . తమిళంలో “మళై పడిక్కత మణితన్” అని తెరకెక్కి గతవారం విడుదలైన చిత్రానికి తెలుగు అనువాద రూపమే ఈ “తుఫాన్”. విజయ్ ఆంటోనీ సీక్రెట్ ఏజెంట్ గా నటించిన ఈ చిత్రంలో మేఘ ఆకాష్ (Megha Akash) హీరోయిన్ గా నటించగా.. కన్నడ స్టార్ హీరో డాలీ ధనుంజయ్ (Dhananjaya) నెగిటివ్ రోల్ ప్లే చేశాడు. మరి తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక చతికిలపడిన ఈ చిత్రం తెలుగువారిని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

Toofan Review

కథ: ఓ భారీ వర్షం కురిసిన రోజున భార్యను పోగొట్టుకొని.. అప్పటినుండి వర్షానికి దూరంగా, తన బాస్ అప్పగించిన మిషన్ కోసం అండమాన్ లో ఒంటరిగా బ్రతుకుతుంటాడు సలీం (విజయ్ ఆంటోనీ). అక్కడ పరిచయమవుతుంది సౌమ్య (మేఘ ఆకాష్). చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి, లోకల్ డాన్ (డాలీ ధనుంజయ్) కారణంగా ఇబ్బందులు పడుతూ ఉంటుంది.

ఈ క్రమంలో సలీం & సౌమ్య మధ్య బంధం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? లోకల్ డాన్ టు సలీం ఎందుకు తలపడాల్సి వచ్చింది? అసలు అండమాన్ లో సలీం మిషన్ ఏమిటి? చీఫ్ ఎందుకని సలీంను అండమాన్ లో ఉంచుతాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “తుఫాన్” చిత్రం.

నటీనటుల పనితీరు: సినిమా మొత్తంలో నటనతో ఆకట్టుకున్నది డాలీ ధనుంజయ్ & శరత్ కుమార్ (R. Sarathkumar) మాత్రమే. మేఘ ఆకాష్, మురళీ శర్మ (Murali Sharma), సత్యరాజ్(Sathyaraj) వంటి సీజన్డ్ ఆర్టిస్టులు కూడా సరైన పాత్ర & రైటింగ్ కొరవడడంతో తేలిపోయారు. విజయ్ ఆంటోనీ ఎప్పట్లానే సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో తన పాత్ర పండించడానికి నానా ఇబ్బందులుపడ్డాడు.

సాంకేతికవర్గం పనితీరు: ఈ చిత్ర దర్శకుడు మరియు సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ (S. D. Vijay Milton) ఎంచుకున్న కథ, కథనంలో ఏమాత్రం కొత్తదనం లేదు. పైపెచ్చు బోలెడన్ని హాలీవుడ్, స్పానిష్ సినిమాల రిఫరెన్సులు కోకొల్లుగా కనిపిస్తాయి. కాకపోతే.. కొన్ని సన్నివేశాలను కంపోజ్ చేసుకున్న విధానం బాగుంది. ఉదాహరణకు బీగల్ డాగ్ గురించి జరిగే ఫైట్ సీన్ టెక్నికల్ గా బాగుంది. అలాగే.. సముద్రంలో కార్ మునిగిపోయే సీక్వెన్స్ ను పిక్చరైజ్ చేసిన విధానం పొయిటిక్ గా ఉంది. ఇలా సీన్ల వారీగా సపరేట్ గా చెప్పుకోవడానికి కొన్ని బాగున్నాయి కానీ.. సినిమాగా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అందువల్ల.. సినిమాటోగ్రాఫర్ గా పర్వాలేదనిపించుకున్నాడు కానీ, దర్శకుడిగా మాత్రం విజయ్ మిల్టన్ విఫలమయ్యాడు.

పాటలు, నేపథ్య సంగీతం, ప్రొడక్షన్ డిజైన్, వి.ఎఫ్.ఎక్స్ వర్క్ గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేకుండాపోయింది.

విశ్లేషణ: ఏడాదికి కనీసం రెండు మూడు సినిమాలు విడుదల చేస్తూ ఇండస్ట్రీకి, ఇండస్ట్రీని నమ్ముకున్న కార్మికులకు ఎంతో సహాపడుతున్న విజయ్ ఆంటోనీ.. నటుడిగా మాత్రం ఇప్పటికీ నిలదొక్కుకోవడానికి ఇబ్బందిపడుతుండడం బాధాకరం. అయితే.. విజయ్ ఆంటోనీ కాన్సెప్ట్ సినిమాలతోనే ముందుకు సాగడం ఉత్తమం అని మరోసారి ఈ “తుఫాన్” నిరూపించింది.

ఫోకస్ పాయింట్: తీరం దాటడానికి నానా తంటాలు పడిన “తుఫాన్”.

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus