టాలీవుడ్ సినిమాల్లో ఇతర భాషల నటులు రావడం పెద్ద విషయమేమీ కాదు. చాలా ఏళ్లుగా మనం ఇలాంటి ఫీట్స్ చూస్తూనే ఉన్నాం. అయితే అలా వచ్చి నటించే ఇతర భాషల నటుల్లో స్టార్ హీరోలు రావడం అరుదు. ఒకవేళ వచ్చినా మల్టీస్టారర్‌లే చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇతర భాషల్లోని ప్రముఖ నటులు, హీరోలు తెలుగుకు వచ్చి అతిథి పాత్రలు, విలన్లుగా కూడా నటిస్తున్నారు. ఇప్పుడు అలా మరో మలయాళ స్టార్ హీరో తెలుగులో ఓ కీలక పాత్రకు సిద్ధమయ్యాడట. ఈ విషయాన్ని ఆల్‌రెడీ తెలుగు ఎంట్రీ ఇచ్చిన మరో మలయాళ స్టార్ హీరో చెప్పాడు.
ఎంట్రీ ఇస్తున్న హీరో టొవినో థామస్ అయితే.. ఆ విషయాన్ని లీక్ చేసిన హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఇక ఆయన చెప్పిన సినిమా ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ (రూమర్డ్ టైటిల్). ఈ సినిమాలో టొవినో థామస్‌తోపాటు మరో మలయాళ అగ్ర నటుడు బిజు మీనన్ కూడా నటిస్తున్నారు అని పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో ప్రశాంత్ నీల్ భారీ ప్లానింగ్ గురించి సమాచారం వచ్చినట్లు అయింది. ఎందుకంటే కొన్ని నెలల క్రితం ఈ వార్త పుకారు రూపంలో టాలీవుడ్‌లోకి వచ్చింది.
కరోనా – లాక్‌డౌన్ పరిస్థితుల తర్వాత వచ్చిన ఓటీటీ విప్లవంలో.. ఇతర భాషల సినిమాలు మనకు బాగా దగ్గరయ్యాయి. అందులో మాలీవుడ్ సినిమాలది అగ్రస్థానం. అలా అక్కడి హీరోలు మనకు సుపరిచితులు అయిపోయారు. ఈ క్రమంలో ‘2018’, ‘లూసిఫర్’, ‘ఏఆర్ఎం’ లాంటి సినిమాలతో టొవినో థామస్ మన వారికి దగ్గరయ్యారు. ఇప్పుడు ‘డ్రాగన్’ సినిమాతో స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తున్నాడు. ఇద్దరి ప్రతిభకు తగ్గట్లే ప్రశాంత్ నీల్ అదిరిపోయే రోల్స్ ఇచ్చి ఉంటారి భావిస్తున్నానని పృథ్వీరాజ్ చెప్పాడు. చూద్దాం మరి ఏ రేంజిలో పాత్రలు రాశాడో నీల్ మామ.