19 ఏళ్ల సినిమా కెరీర్ లో త్రిష చేయని పాత్ర లేదు, జతగా నటించని కథానాయకుడు లేదు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా దాదాపు అన్నీ భాషల్లోనూ కథానాయికగా నటించిన ఘనత ఉన్న ఏకైక కథానాయిక త్రిష. అందాలతో మాత్రమే కాదు అద్వితీయమైన అభినయంతోనూ ప్రేక్షకుల్ని తన అభిమానులుగా మార్చుకున్న త్రిష త్వరలోనే సినిమాలకు స్వస్తిపలకనుందని తెలుస్తోంది. ఇటీవల కాలంలో రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ చేయడం మానేసి.. కథ మరియు పాత్రకి ప్రాధాన్యమున్న సినిమాలు మాత్రమే ఒప్పుకొంటూ నటిగా తన ఉనికిని పదిలపరుచుకుంటూనే తనలోని నటిని సంతృప్తి పరుస్తుంది. అయితే.. తాజా సమాచారం మేరకు త్రిష ఇకపై సినిమాలు చేయబోయేది లేదని తెలుస్తోంది.
అందుకు కారణం ఆమె నటించిన తాజా తమిళ చిత్రం “96”. విజయ్ సేతుపతి-త్రిష జంటగా తెరకెక్కిన “96” రేపు విడుదలవుతోంది. ఆల్రెడీ కొందరు రివ్యూ రైటర్స్ కి స్పెషల్ షో వేసి సినిమాను చూపించారు. త్రిష కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ఆమె పోషించిన పాత్రకు ప్రాముఖ్యత తీసుకురావడంతోపాటు.. సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని టాక్. ఇదే సందర్భంలో త్రిష కొందరు మీడియా మిత్రులతో మాట్లాడుతూ “ఈ సినిమా తర్వాత తాను సినిమాలు చేయడం మానేస్తే బెటర్ అని, ఎందుకంటే ఇంతకంటే మంచి సినిమా తనకు వచ్చే అవకాశం లేదని” చెప్పుకొచ్చిందట. మరి త్రిష ఈ నిర్ణయాన్ని సీరియస్ గా తీసుకొందా లేక సరదాగా అన్నదా అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.