మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో తొలిసారి వచ్చిన మూవీ “అరవింద సమేత వీర రాఘవ”. ఈ సినిమా దసరా సందర్భంగా రిలీజ్ అయి మాస్, క్లాస్ అని తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటోంది. ఫ్యాక్షన్ సినిమాల్లోనే క్లాసిక్ మూవీగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం వందకోట్ల షేర్ సాధించి దూసుకుపోతోంది. ఈ సందర్భంగా అరవింద సమేత కథ పుట్టుక, స్క్రిప్ట్ వెనుక సంగతులను త్రివిక్రమ్ వెల్లడించారు. “అజ్ఞాతవాసి చిత్రం విడుదలయ్యాక పూర్తి నిరాశలోకి వెళ్లా. నాలుగవరోజు నిరాశ నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నా. ఆరోజే అరవింద సమేత కథ ప్రారంభించాను. జనవరి 19 ఎన్టీఆర్ కు కొంత భాగం కథ వివరించాను. అప్పటికి ఇంకా క్లైమాక్స్ గురించి అనుకోలేదు.
మొదటి 20 నిమిషాలు ఎన్టీఆర్ కు బాగా నచ్చింది” అని వివరించారు. కథలో మహిళా సాధికారత కోణం గురించి మాట్లాడుతూ “కథ రాస్తున్న సమయంలో మహిళా సాధికారత పాయింట్ నచ్చి అనుకోకుండా ఆ అంశాన్ని కూడా చేర్చాము. అది బాగా కథకి కలిసి వచ్చింది.” అని త్రివిక్రమ్ చెప్పారు. జిగేలు రాణి పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఫ్యాక్షన్ నాయకుడిగా జగపతి బాబు అద్భుతంగా నటించారు. హారిక హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించిన ఈ మూవీ ఎన్టీఆర్ కి వరుసగా ఐదవ విజయాన్ని అందించింది.