పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూడో చిత్రం ‘అజ్ఞాతవాసి’. హాసిని అండ్ హారిక క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ వంద కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ జనవరి 10 న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాని ప్రముఖుల కోసం ప్రత్యేక షోని వేయనున్నారు. అందుకు స్వయంగా డైరక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తున్నారు. తొలుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుని పిలిచిన త్రివిక్రమ్ .. వెంటనే సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ ని ఆహ్వానించారు.
మంత్రిని కలిసిన వారిలో F D C చైర్మన్ రామ్మోహన్ రావు కూడా ఉన్నారు. పవన్ కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 25వ సినిమా అజ్ఞాతవాసిలో కీర్తి సురేష్, అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలనాటి నటి కుష్బూ కీలక రోల్ పోషిస్తుండగా.. వెంకటేష్ గెస్ట్ రోల్ తో మెప్పించనున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ కంపోజ్ చేసిన పాటలు సినిమాని మరింత బలం కానున్నాయి. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 150 కోట్ల బిజినెస్ చేసి ఔరా అనిపించింది. ఇక రిలీజ్ అయిన తర్వాత అనేక రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.