పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ ప్లాన్

ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆలోచిస్తున్నారు. ఒకే సినిమాతో నోట్లు, ఓట్లు కురవాలని ప్లాన్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల లోపు వీలైనన్ని సినిమాలు పూర్తి చేయాలనీ భావిస్తున్నారు. అందుకే కాటమరాయుడు షూటింగ్ దశలో ఉండగానే దసరా రోజు నీసన్ దర్శకత్వంలో రానున్న సినిమాకు పూజలు నిర్వహించారు. ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రాన్ని ఈ నెల 5 వ తేదీన లాంఛనంగా ప్రారంభించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీకి తమిళ యువ మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ స్వరాలను అందిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతున్న ఈ సినిమా గురించి ఆసక్తికర సంగతి బయటికి వచ్చింది.

ఈ ఫిల్మ్ లో జనంలోంచి ఒక నాయకుడు పుట్టి, ప్రజల సమస్యలపై పోరాడే విధంగా  హీరో పాత్రను మలిచినట్లు తెలిసింది. జనసేన అధ్యక్షుడుకి ఓట్లు కురిసేవిధంగా ఇందులో మాటలను త్రివిక్రమ్ రాసారని సమాచారం. వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయాలనీ భావిస్తున్న ఈ మూవీకి ఒక దేశ భక్తుడి పేరు పెట్టాలని ఆలోచనలో ఉన్నారు. పూర్తి స్థాయిలో దేశభక్తి సినిమాను పవన్ కానీ, త్రివిక్రమ్ కానీ ఇదివరకు చేయలేదు. తొలిసారి వీరిద్దరు కలిసి కమర్షియల్ ఫార్ములాను మిస్ చేయకుండా,  దేశభక్తుడి స్టోరీ ని మనముందుకు తీసుకురాబోతున్నారు. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన రెండు చిత్రాలు కలక్షన్ల వర్షం కురిపించాయి. ఈ మూడో చిత్రం నోట్లతో పాటు ఓట్లను కురిపించడం ఖాయమని పవన్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus