ఎంత అనుభవం ఉన్న డైరెక్టర్ అయినా సక్సస్ కోసం శ్రమించక తప్పదు. ప్రతి చిత్రాన్ని కొత్త చిత్రం లాగే భావించాలి. ఓటమి ఎక్కడ పలకరిస్తుందోనని భయం ఉంటుంది. ఆ భయంతో త్రివిక్రమ్ సక్సస్ మంత్రాన్ని ఫాలో అవుతున్నారని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. శ్రమతో పాటు సెంటిమెంట్స్ ని వదలడం లేదని అంటున్నారు. అత్తారింటికి దారేది దారిలోనే నడుస్తున్నారని చెప్పారు. “అత్తారింటికి దారేది” చిత్రంలో పవన్ కళ్యాణ్ బాగా డబ్బున్న వ్యక్తి. అజ్ఞాతవాసిలోనూ కోటీశ్వరుడు. అందులో సమంత, ప్రణీత ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఇందులోనూ ఇద్దరి భామలను నటింపజేయించారు. అను ఇమ్యానుయేల్, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటించారు.
ఇక అలనాటి నాయిక నదియా పవన్ కి అత్తగా నటించింది. “అజ్ఞాతవాసి”లో నదియాకి బదులు కుష్బూకి కీలకరోల్ ఇచ్చారు. అయితే ఆమె పిన్ని రోల్ పోషించినట్లు సమాచారం. మరో విషయం ఏమిటంటే “అత్తారింటికి దారేది” కోసం కాటమరాయుడా పాట పాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడీ చిత్రంలో “కొడకా కోటేశ్వరరావు” అంటూ గొంతు సవరించుకున్నారు. ఇంతటితో ఆగిపోలేదు. ఆ చిత్రంలో మ్యూజిక్ డైరక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఓ పాటలో కనిపించారు. అలానే “అజ్ఞాతవాసి” సినిమాలోనూ “గాలివాలుగా” అనే పాటలో ఈ చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్‌ను తెరపై కనిపిస్తారని సమాచారం. ఇలా అనేక విషయాల్లో త్రివిక్రమ్ గత చిత్రాన్ని ఫాలో అయ్యారు. అజ్ఞాతవాసితో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని తపిస్తున్నారు. ఫలితం మరో నాలుగు రోజుల్లో తెలియనుంది.