ఎప్పుడో ఏళ్ల క్రితం తెలుగులో పాటలు పాడి, సంగీత దర్శకత్వం చేసిన ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్ కమ్ సింగర్ అయిన రమణ గోగులను ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా గురించి తిరిగి తీసుకొచ్చారు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన వచ్చి ‘గోదారి గట్టు మీద..’ అంటూ పాట పాడితే అది మిలియన్ల వ్యూస్ దాటిపోయింది. ఆ పాట వైబ్ ఇప్పటికీ మన చెవుల్లో మోగుతూనే ఉంది. అలాంటి అవకాశం ఇచ్చిన అనిల్ రావిపూడికి అందరూ ఇప్పటికీ థ్యాంక్స్ చెబుతున్నారు. ఈ క్రమంలో మరోసారి ఆయన తన మార్కును చూపించారు.
మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను త్వరలో విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ఓ ప్రోమోను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. అయితే ఆ పాటను ఎప్పుడు రిలీజ్ చేసేది అనేది మాత్రం చెప్పలేదు. ఆ పాటలో చిరంజీవి తన గ్రేస్‌ఫుల్ స్టెప్పులతో, నయనతార తన అందంతో అలరించింది. ఈ రెండూ ఎప్పుడూ ఉండేవే.. ఇందులో కొత్తదనం ఏం లేదు కూడా. అయితే దాని కంటే ముందు వచ్చిన మరో వీడియో గురించే ఇప్పడు చర్చ.
‘మీసాల పిల్ల..’ అంటూ సాగే ఈ పాటకు సెమీ టీజర్‌లా ఓ అనౌన్స్‌మెంట్ వీడియోను అనిల్ రావిపూడి టీమ్ సిద్ధం చేసింది. ఆ వీడియో ద్వారా ఈ పాటను పాడింది ప్రఖ్యాత సింగర్ ఉదిత్ నారాయణ్ అని చెప్పే ప్రయత్నం చేశారు అనిల్ రావిపూడి. దానిని తనదైన కామెడీ టైమింగ్‌తో రూపొందించారు. ఉదిత్ నారాయణ్ గతంలో చిరంజీవికి పాడిన పాటలను గుర్తు చేసేలా.. ఆ వీడియో ఉంది.
దీంతో ఇలాంటి వీడియోలు చేయాలంటే అనిల్ తర్వాతే అని ఇండస్ట్రీలో ఉన్న టాక్ ఇప్పుడు మరింత బలపడింది. సినిమా ప్రారంభానికి ముందు నయనతారతో ఇలాంటి వీడియో ఒకటి చేయించి రిలీజ్ చేయించారు. అప్పుడే అనిల్ అదరహో అన్నారు. ఇప్పుడు ఉదిత్ నారాయణ్ వీడియోతో ప్రమోషన్స్‌లో ఇంకో స్టెప్ ఎక్కేశారు. మరి నెక్స్ట్ ఇంకెలాంటి వీడియోలు వస్తాయో చూడాలి.