యాక్టర్ నందు (Shree Nandu) కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఓ పక్క పెద్ద సినిమాల్లో చిన్న చితకా పాత్రలు చేస్తూనే మరోపక్క చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. ఇప్పటికే హీరోగా చాలా సినిమాల్లో నటించాడు. కానీ ఏదీ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇప్పుడు ‘అగ్లీ స్టోరీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో అయినా నందు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాడేమో తెలుసుకుందాం రండి:
కథ: చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన నేహాని (అవికా గోర్) ఆమె అమ్మమ్మ అన్నీ తానై పెంచుతుంది. ఆ చిన్నతనంలోనే నేహా తన స్నేహితుడు గౌతమ్‌తో (రవితేజ మహదాస్యం) ప్రేమలో పడుతుంది. అయితే ఒక రోజు నేహా అమ్మమ్మ కూడా చనిపోవడంతో.. ఆమె మావయ్య నారాయణ రావు (శివాజీ రాజా) నేహాని చేరదీస్తాడు.అప్పటికే నారాయణ రావు భార్య చనిపోవడంతో అతని కొడుకు కార్తీక్ (శ్రీ నందు) డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాడు. ఒక పాప బొమ్మతో మాత్రమే మాట్లాడుతూ, ఒక గదికే పరిమితమైపోతాడు. కొడుకు పరిస్థితి చూసి తండ్రి నారాయణ రావు అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్తే.. కార్తీక్ ఒక మానసిక రోగి(సైకో) అని తెలుస్తుంది. నేహా వస్తే తన కొడుకు మారతాడేమో అనే ఆశతో… ఆమెను కార్తీక్‌కి ఇచ్చి పెళ్లి చేయాలని నారాయణ రావు అనుకుంటాడు. ఇదే విషయాన్ని కార్తీక్‌తో చెప్పడంతో, అప్పటినుంచి కార్తీక్.. నేహాని తన భార్యగా ఫిక్స్ అయిపోతాడు.
ఈ క్రమంలో ఆమెతో ఎవరైనా మాట్లాడాలని ప్రయత్నిస్తే.. వాళ్ళపై దాడి చేస్తూ ఉంటాడు. ఇతని పిచ్చి ప్రవర్తన చూసి, నేహా జీవితం ఏమైపోతుందో అని నారాయణ రావు భయపడతాడు. కానీ, ‘నేహాని నాకు ఇచ్చి పెళ్లి చేయకపోతే.. తండ్రివని కూడా చూడకుండా నిన్ను చంపేస్తా’ అని కార్తీక్ అతనిపై దాడికి దిగుతాడు. మావయ్య ప్రాణాలు కాపాడేందుకు గత్యంతరం లేని నేహా… గౌతమ్ ప్రేమను త్యాగం చేసి కార్తీక్‌ను పెళ్లి చేసుకుంటుంది. ‘పెళ్ళైనప్పటి నుండి కార్తీక్.. నేహాని దారుణంగా వేధిస్తూ ఉంటాడు. రాత్రైత చాలు ఓ మృగంలా మారిపోయి ఆమెను శారీరకంగా దాడి చేస్తూ ఉంటాడు. చివరికి కార్తీక్ బారి నుండి నేహా ఎలా తప్పించుకుంది? తర్వాత కార్తీక్ జీవితం ఏమైంది? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: మానసిక రోగి పాత్రలో నందు పెర్ఫార్మన్స్ బాగుంది. అతని కెరీర్ గ్రాఫ్ మొత్తం చూసుకుంటే.. ఇలాంటి పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర ఒక్కటి కూడా పడలేదు అనే చెప్పాలి. డైరెక్టర్ కూడా నందుని వంద శాతం వాడుకున్నాడు అనే చెప్పాలి. 365 డిగ్రీస్..లోనూ నందు ది బెస్ట్ ఇచ్చాడు. హీరోయిన్ అవికా గోర్ నిస్సహాయ స్థితిలో ఉండే గృహిణి పాత్రలో జీవించింది. క్లోజప్ షాట్స్ లో కొంచెం డల్ గా కనిపించినా… ఇంటిమేట్ సన్నివేశాల్లో కూడా బోల్డ్ గా నటించింది. రవితేజ మహదాస్యం పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. ఉన్నంతలో తన మార్క్ నటనతో మెప్పించాడు. హీరో తండ్రి పాత్రలో శివాజీ రాజా చేశారు. ఆయన చేయడం వల్ల ఆ పాత్రకు నిండుతనం వచ్చింది అని చెప్పాలి. మిగతా నటీనటులు పాత్రలు ఓకె.
సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు ప్రణవ స్వరూప్ ఓ బోల్డ్ పాయింట్ తీసుకున్నారు. అయితే దర్శకుడు ఎక్కడా సేఫ్ గేమ్ ఆడలేదు. సాధారణంగా ఇలాంటి జోనర్ సినిమాల్లో హీరో పాత్రని అటు ఇటు చేసి మంచిగా మార్చేయడం, లేదంటే హీరోయిన్.. హీరో పిచ్చి ప్రేమని అర్ధం చేసుకున్నట్టు చూపించి కన్నీళ్లు పెట్టుకుని కౌగిలించుకున్నట్టో.. చూపించి మమ అనిపించేస్తారు.కానీ దర్శకుడు అలాంటి స్టెప్ ఏమీ తీసుకోకపోవడం అభినందించదగ్గ విషయం. ‘ఎలాంటి వాడి ప్రేమ అయినా కాన్స్టెంట్ గా ఉండదు’ అంటూ నందు పాత్రతో పలికించిన డైలాగుల్లో చాలా డెప్త్ ఉంది.
హీరో పాత్రలో ఎంత తప్పు ఉందో.. దానికి సమాంతరంగా హీరోయిన్ పాత్రలో కూడా తప్పు ఉంటుంది. ఇలా చాలా హానెస్ట్ గా కథనాన్ని నడిపించాడు దర్శకుడు. నేటి సమాజంలో ఇలాంటి దారుణమైన సంఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. కానీ తప్పంతా ఒకరి వైపే ఉన్నట్టు ప్రోజెక్ట్ చేస్తుంటారు. కానీ ‘అగ్లీ స్టోరీ’ లో ‘తప్పు రెండు వైపులా ఉంటుంది.. రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు’ అన్నట్టు కుండబద్దలుకొట్టినట్టు చూపించాడు దర్శకుడు. ఇది అసలైన బోల్డ్ ట్రీట్మెంట్ అనేలా ఉంటుంది..! కొన్ని సన్నివేశాలు చాలా రియలిస్టిక్ ఫీల్ ఇస్తాయి. ఉదాహరణకి ఫస్ట్ హాఫ్ లో కార్లో భర్త… భార్యని లొంగదీసుకునే సన్నివేశం, అటు తర్వాత ఆమె కాలేజీ వాష్ రూంలోకి వెళ్లి హీరోయిన్ బాధపడే సన్నివేశం వంటివి చాలా సహజంగా అనిపిస్తాయి.
అయితే శివాజీ రాజా పాత్రని అర్ధాంతరంగా ముగించడం అనేది ఒకింత డిజప్పాయింట్మెంట్ చేసే అంశం. ఇక టెక్నికల్ గా చూసుకుంటే.. శ్రవణ్ భరద్వాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలెట్ అని చెప్పాలి. సగటు ప్రేక్షకుడు కథలోకి లీనమయ్యేలా ఆర్ ఆర్ అందించాడు. ఉదాహరణకి సెకండాఫ్ లో ఒక సన్నివేశం ఉంటుంది. హీరో బయట కూర్చొని.. ‘నేహా అని పిలిస్తే.. హీరోయిన్ ఊ’ అని అనాలి. చెప్పుకోవడానికి చాలా సాదా సీదా సీన్ అది. కానీ ఆర్ ఆర్ కారణంగా ఆ సీన్ కూడా హైలెట్ అవుతుంది. ఇలా చాలా సాదా సీదా సన్నివేశాలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల హైలెట్ అయ్యాయి.సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. విజువల్స్ అన్నీ చాలా క్వాలిటీగా అనిపించాయి. ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది. నిర్మాణ విలువలు కథకి తగ్గట్టు ఉన్నాయి. ఎక్కడా వంక పెట్టేలా అయితే లేవు.
విశ్లేషణ: ‘అగ్లీ స్టోరీ’ ఓ ఇంటెన్సిటీ ఉన్న కథ. చెప్పుకోవడానికి ఫ్లాట్ గా అనిపించొచ్చు కానీ.. కథనం అందరినీ కట్టిపడేస్తుంది. లాస్ట్ సీన్ వరకు కూడా నెక్స్ట్ ఏ సీన్ వస్తుంది అనే ఎక్సయిట్మెంట్ ఉంటుంది. మొత్తంగా టార్గెటెడ్ ఆడియన్స్ కి కచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఫోకస్: ‘అగ్లీ స్టోరీ’.. ఓ హానెస్ట్ అటెంప్ట్
రేటింగ్: 2.75/5