కల్ట్ ఫిలిం మేకర్ ఉపేంద్ర దాదాపు 9 ఏళ్ల తర్వాత దర్శకత్వం వహించిన చిత్రం “యుఐ”. సినిమా టీజర్ నుండే ఉపేంద్ర మార్క్ కనిపించింది. ఫ్యూచరిస్టిక్ పొలిటికల్ సెటైర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ విడుదలైంది. మరి ఈ ఉపేంద్ర సినిమాను ప్రేక్షకులు అర్థం చేసుకోగలిగారా? ఇంతకీ సినిమా పాయింట్ ఏమిటి? అనేది చూద్దాం..!!
కథ: థియేటర్లో విడుదలైన ఒక సినిమా చూసి ప్రేక్షకులు పిచ్చిపిచ్చిగా బిహేవ్ చేయడం మొదలెడతారు. సెన్సార్ బోర్డ్ సభ్యులు 25 సార్లు చూసి “యుఐ (యూనివర్సల్ ఇంటిలిజెన్స్ సర్టిఫికెట్” ఇచ్చిన ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలి అని కొందరు రోడ్డుకెక్కితే, సినిమా చూసాక జీవితం మీద క్లారిటీ వచ్చిందంటూ కొందరు విముక్తి పొందినట్లుగా స్వేచ్ఛగా తిరుగుతుంటారు.
101 నిమిషాల సినిమాల రివ్యూ రాయడానికి ఇండియాలోనే టాప్ ఫిలిం క్రిటిక్ అయిన కిరణ్ ఆదర్శ్ (మురళీశర్మ)కి కూడా నాలుగుసార్లు చూసినా అర్థం కాక, వారం పడుతుంది. అసలు దర్శకుడు ఉపేంద్ర (ఉపేంద్ర) ఈ సినిమాని ఎలా తీశాడు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం జర్నీ మొదలుపెడతాడు.
అక్కడ కిరణ్ ఆదర్శ్ తెలుసుకున్న విషయం ఏమిటి? ఇంతకీ యుఐ సినిమాలో ఏముంది? ఎందుకని ప్రేక్షకులు అంతలా రియాక్ట్ అవుతున్నారు? అనేది తెలియాలంటే మాత్రం “యుఐ” చిత్రం చూడాల్సిందే.
నటీనటుల పనితీరు: స్పెసిఫిక్ గా ఒకరి నటన బాగుంది, ఒకరిది బాలేదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే.. ప్రతి పాత్ర మన సొసైటీలోని వివిధరకమైన మనుషుల్ని ప్రొజెక్ట్ చేస్తుంది. ఉదాహరణకు హీరోయిన్ పాత్ర ప్రస్తుతం జెన్ జీ జనరేషన్ ను రీప్రెజెంట్ చేస్తుంది, ఏ విషయాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా లేక తమలో తామే కొట్టుమిట్టాడే వ్యవహారశైలి ఆ పాత్రది. ఇక రవిశంకర్ పాత్ర సామాజిక వ్యవస్థను తలపిస్తుంది. ఇక ఉపేంద్ర పోషించిన రెండు పాత్రల్లో ఒకటి తాను కోరుకుంటున్న సమాజం, మరొకటి ప్రస్తుత సమాజ తీరును ఎండగట్టినట్లుగా ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క పాత్రతోనూ ప్రేక్షకులకు రియాలిటీ చెక్ ఇచ్చాడు ఉపేంద్ర.
సాంకేతికవర్గం పనితీరు: టెక్నీషియన్స్ లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆర్ట్ డిపార్ట్మెంట్ & ప్రొడక్షన్ డిజైన్ గురించి. అంత తక్కువ బడ్జెట్లో ఆస్థాయి ఆర్ట్ వర్క్ & సీజీ వర్క్ ఎలా కుదిరింది అనేది భవిష్యత్ ఫిలిం మేకర్స్ కి ఓ పాఠ్యాంశంగా నిలుస్తుంది.
ఇక సంగీత దర్శకుడు అజనీష్ లోక్నాథ్ ది అత్యంత క్లిష్టమైన పనిగా చెప్పాలి. పాటలు ఆల్రెడీ ఎంత వెరైటీగా ఉన్నాయో అందరూ విన్నారు. నేపథ్య సంగీతం అంతకుమించి వైవిధ్యంగా ఉంది. దర్శకుడు ఉపేంద్ర ఆలోచనను అర్థం చేసుకొని, దానికి తగ్గట్లు నేపథ్య సంగీతం అందించడం అనేది మామూలు విషయం కాదు. చాలా చోట్ల వెటకారంగా ఉన్నప్పటికీ.. ఆ వెటకారం అనేది ప్రేక్షకుల్ని వెక్కిరిస్తున్నట్లు అని అర్ధమైనప్పుడు అతడి పనితనం విలువ తెలుస్తుంది.
సినిమాటోగ్రఫీ వర్క్ భలే గమ్మత్తుగా ఉంది. ముఖ్యంగా బంధీ చేయబడ్డ ఉపేంద్ర బయటపడే సీక్వెన్స్ మొత్తాన్ని తెరకెక్కించిన తీరు గురించి ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో గొప్పగా మాట్లాడుకుంటారు.
ఇక దర్శకుడు ఉపేంద్ర గురించి మాట్లాడుకుందాం. సినిమాలో ఆయన ఎలాంటి మెసేజ్ ఇవ్వలేదు, నువ్ ఇలానే ఉండిపోతే ఇది నీ భవిష్యత్ అని ప్రేక్షకులకు వార్నింగ్ ఇచ్చాడు. రాజకీయ నాయకులు పథకాల పేరుతో ప్రజలను ఎలా మభ్యపెడుతున్నారు, ప్రభుత్వ వ్యవస్థలు ప్రజల్ని నిజం నుండి దూరం చేయడానికి క్రికెట్ అనే ఆటను ఎలా అలవాటు చేసింది, వాళ్లు టైమ్ వేస్ట్ చేయడానికి బిగ్ బాస్ ను ఎలా వినియోగిస్తుంది, సాంకేతికలో పురోగమనం అంటూ ప్రజలకి కనీస స్థాయి అవసరాలు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఎలా మోసం చేస్తుంది, అలాగే పురోగమనం అంటూ భూమిని, పర్యావరణానికి ఏ స్థాయిలో హాని చేకూరుస్తున్నారు? వంటి ఎన్నో విషయాలను ప్రస్తావించారు ఉపేంద్ర, చివర్లో మళ్లీ ప్రేక్షకుల మీద వేసిన పంచ్ సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పాలి.
ఇక ఎండింగ్ ఫ్రేమ్ లో మనుషుల్ని శాసిస్తున్న ఎంటర్టైన్మెంట్, అశ్లీలత, రాజకీయంను “యుఐ” సింబల్ లో ఇరికించి అందులో నుంచి బయటపడు అంటూ ఇచ్చిన వార్నింగ్ బాగుంది. ఒక దర్శకుడిగా ఉపేంద్ర ఆలోచనాధోరణికి మాత్రం దండం పెట్టాల్సిందే.
విశ్లేషణ: కొన్ని సినిమాలు ఎంటర్టైన్ చేస్తాయి, కొన్ని సినిమాలు ఆలోచింపజేస్తాయి, ఇంకొన్ని భయపెడతాయి. “యుఐ” మాత్రం రియాలిటీ చెక్ ఇస్తుంది. నువ్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో తెలుసుకో, త్వరగా మేలుకో అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఈ సినిమాను అందరూ ఆస్వాదించలేరు. అయితే.. ఉపేంద్ర మార్క్ సీన్ కంపోజిషన్ & ఐడియాలజీ మాత్రం ఆయన వీరాభిమానుల్ని విశేషంగా అలరిస్తుంది. ఇక పొలిటికల్ ఫ్యాన్స్ ను ఈ సినిమా ఓ రేంజ్ లో హర్ట్ చేయడం ఖాయం. ఏ ఒక్క పార్టీని వదిలిపెట్టకుండా, అందర్నీ కెలికేశాడు ఉపేంద్ర. ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం “యుఐ”నీ చూడండి. థియేటర్లోనా లేక ఇంకెక్కడైనానా అనేది మీ ఇష్టం!
ఫోకస్ పాయింట్: ప్రేక్షకులు తెలివైనోళ్లే ఉపేంద్ర.. నువ్వు మాత్రం ఘటికుడివి!
రేటింగ్: 2.5/5