ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!

అంతఃపురం తెలుగు సినిమాల్లో అసలైన కల్ట్ క్లాసిక్. ఎన్నో ఫ్యాక్షన్ సినిమాలొచ్చినా “ఇదా ఒకప్పటి ఫ్యాక్షన్!” అని ఆశ్చర్యంతో ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోయిన సినిమా ఇది… అంతఃపురం సినిమా 1998 లో వచ్చింది.. ఆ సినిమా చూసిన వాళ్ళకి క్లయిమ్యాక్స్ సీన్ చాలా బలంగా మనసులో ముద్రపడిపోతుంది.. జగపతిబాబు పాత్ర, దర్శకులు కృష్ణవంశీ ఆయనతో చేయించిన నటన నభూతో న భవిష్యతి అన్నట్టుంటాయ్..

బ్లడ్ డైమండ్ అనే హాలీవుడ్ సినిమా 2006 లో వచ్చింది.. హీరో డికాప్రియో క్లయిమ్యాక్స్ లో చేసిన నటన చూసి, అందరూ అతనికి అకాడమీ అవార్డ్ ఆ సినిమాకే వస్తుంది అని కూడా అనుకున్నారు.. కానీ తర్వాత వేరే సినిమాకి వచ్చింది, అది అప్రస్తుతం..

ఇప్పుడీ 2 సినిమాలు ఎందుకు చెప్పానంటే, ఈ 2 సినిమాల క్లైమాక్స్ సీన్స్ దాదాపు ఓకే విధంగా ఉంటాయి.. ఇంతకుముందు ఇలాంటి సీన్స్ మిగిలిన సినిమాల్లో కూడా ఉండొచ్చు, లేకపోవచ్చు.. కానీ ఈ 2 సినిమాల్లో ఆ పాత్ర తీరుతెన్నులు, అలాగే క్లైమాక్స్ సీన్స్ లో వారి పాత్ర ప్రవర్తించే తీరులో ఎన్నో పోలికలుంటాయి..

* అంతఃపురం లో జగపతిబాబు, తన భవిష్యత్ కోసం డబ్బు మీద వ్యామోహంతో దొంగసారా లాంటి వ్యాపారాలు చేస్తూ ఉంటాడు..
* బ్లడ్ డైమండ్ సినిమాలో డికాప్రియో పాత్ర, తన భవిష్యత్ బాగుండాలని వజ్రాల కోసం ఆరాటపడుతుంది..
* అంతఃపురం లో జగపతి, సౌందర్య, ఆమె కొడుకుని కాపాడుతూ చనిపోతాడు..
* డికాప్రియో, తన స్నేహితుడిని, అతని కొడుకుని కాపాడుతూ చనిపోతాడు..
* ఇద్దరూ చనిపోయే ముందు దాదాపు ఒకేలా నటించారు..(అప్పుడు సిగరెట్ తాగడంతో సహా)…
ఇలా చాలా పొలికలున్నాయి..

అయితే మన అంతఃపురం 1998 లో విడుదలైన, 8 ఏళ్ల తర్వాత 2006 లో హాలీవుడ్ లో బ్లడ్ డైమండ్ సినిమా వచ్చింది..

“అబ్బా.. ఛా.. హాలీవుడ్ లో వాళ్ళు మన తెలుగు సినిమా కాపీ కొట్టేసారా!?” అని మన అపరమేధావులకు అడ్డమైన డౌట్లు రావచ్చు.. ఎందుకు కొట్టరమ్మా?.. గతంలో చాలా జరిగిన సంఘటనలున్నాయి చరిత్రలో” అనేది నా సమాధానం..

గుడ్డుమీద వెంట్రుకలు తీసి, విజ్ఞాన ప్రదర్శనలు చేసే కొందరు కొలంబస్ లు ‘అసలు కృష్ణవంశీ తీసిన అంతఃపురం కూడా అదేదో సినిమా ‘నాట్ వితౌట్ మై డాటర్’ అనే సినిమా స్ఫూర్తి లేదా ఆడాప్ట్ చేసుకున్న ఐడియా’ అని కూడా అనుకోవచ్చు.. ఒకవేళ ఆ సినిమాలో ఏదో ఒక అంశం స్ఫూర్తి అయినా కూడా అందులో జగపతి పాత్ర ఉండదు, ఆ కథ వేరే..

ఇప్పుడు చెప్పండి.. క్రియేటివ్ డైరెక్టర్ ఎంత ముందు చూపుతో తీసారో!.. మొబైల్ ఫోన్ అందుబాటులో లేని రోజుల్లో ‘గులాబీ’ సినిమాలో కార్డ్ లెస్ ఫోన్స్ పెట్టి మనల్ని మాయచేసి, ఔరా! ఇదేదో ఫోన్ భలే ఉందే అనుకునేలా చేసారు.. అలాగే నాలాంటి చాలామందికి ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా చూసేవరకు, ల్యాండ్ ఫోన్స్ లో చూసుకుంటూ మాట్లాడే సౌకర్యం ఒకటుందని కనీసం తెలీనుకూడా తెలీదు.. ఇలా ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త విషయం ప్రేక్షకులకు చెప్తూ, ఆయన సృజనాత్మకతతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ వచ్చారు.. ఆ తర్వాత కాలప్రవాహంలో కాస్త నెమ్మదించారు..

కానీ అంతఃపురం సినిమా గురించి మాత్రమే చెప్పాలంటే….

ప్రకాశ్ రాజ్ కెరీర్ లో ఇలాంటి పాత్ర ఆయనే మళ్ళీ చెయ్యలేదు..రాగి సంగటి, మాంసం కూర తినే సీను… జీవి ని చంపే సీన్… ఫ్యాక్షన్ గొడవల గురించి సాయికుమార్, ప్రకాశ్ రాజ్ ల మధ్య ఆర్గుమెంట్… అక్కడి వాతావరణం, గాలి, ధూళి…. అలాగే సౌందర్య ఈ సినిమాలో మరింత అపురూప సౌందర్యారాశిలా మనకు కనిపిస్తుంది.. ముఖ్యంగా సీమకొచ్చాక ముత్తయిదువుల పేరంటం సీన్ తర్వాత అలసిపోయుంటే, సాయికుమార్ వచ్చి నోటితో ఊదిన గాలికి ఆమె బుగ్గ సొట్టపడేంత లేత చెక్కిళ్ళ సౌందర్యం మర్చిపోగలమా!…

ప్రకాశ్ రాజ్ మనుషులు సౌందర్యను, ఆమె కొడుకును తరుముతూ, ఒకచోట పడుకున్న జగపతిబాబు కాలు తొక్కేస్తే, ‘సారీ చెప్పమని’ అడుగుతుంటే వాళ్ళు ‘నరసింహం అన్న పేరెప్పుడన్నా ఇన్నావా’ ,అంటే “ఆడెవడు?’ అని జగపతిబాబు అన్నప్పుడు సౌందర్య చూసిన చూపు…… ప్రకాష్ రాజ్ పై శారద ఎదురుతిరిగి మాట్లాడే సీన్… దాసరి అరుణకుమార్ సై చిందేయ్ డాన్స్… ‘అసలేం గుర్తుకు రాదు’ పాట.. అన్నింటికంటే మాస్ట్రో ఇళయరాజా సంగీతం… మనం రెగ్యులర్ గా చూసిన ఫ్యాక్షన్ సినిమాలన్నీ ఒకెత్తు, అంతఃపురం ఒక్కటీ ఒకెత్తు అనేలా తీసిన కృష్ణవంశీ ఈ సినిమా తీసి అప్పుడే 21 ఏళ్ళయిందని గుర్తురాగానే సినిమా మొత్తం అలా మెదడులో తిరుగుతూనే ఉంది…

– లక్ష్మీ భూపాల

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus