Baahubali: The Beginning: పదేళ్ల ఏళ్ల ‘బాహుబలి’.. ఈ 10 విషయాలు తెలుసా?

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన సినిమాల్లో ‘బాహుబలి’ సినిమాలు కచ్చితంగా ఉంటాయి. అందులో తొలి భాగం ‘బాహుబలి: ది బిగినింగ్‌’ వచ్చి పదేళ్లు అవుతోంది. అంటే జక్కన్న రాజమౌళి చెక్కిన శిల్పం ‘బాహుబలి’కి ఈ రోజు పదో పుట్టిన రోజు. మరి ఈ స్పెషల్‌ డే నాడు స్పెషల్‌ సినిమా గురించి స్పెషల్‌గా నిలిచే ఓ ‘స్పెషల్‌ 10’ గురించి చూద్దామా. ఏంటీ ఇన్ని స్పెషల్స్‌ అనుకుంటున్నారా? ‘బాహుబలి’ లాంటి సినిమా గురించి చెప్పినప్పుడు ఆ మాత్రం స్పెషల్‌ ఉండాలి లెండి. మరి చూద్దామా ఆ పది అంశాలేంటో?

10 Years For Baahubali: The Beginning

– ‘బాహుబలి: ది బిగినింగ్‌’ బడ్జెట్‌ సుమారు రూ. 180 కోట్లు. ఆ రోజుల్లో ఒక ఇండియన్‌ సినిమాకు ఈ బడ్జెట్‌ చాలా ఎక్కువ. సుమారు 4000 స్క్రీన్స్‌లో ఈ సినిమాను విడుదల చేయగా.. రూ.685 కోట్లు వసూలు చేసింది.

– రాజమాత శివగామి పాత్ర కోసం తొలుత అతిలోక సుందరి శ్రీదేవిని తీసుకుందాం అనుకున్నారు. కానీ వివిధ కారణాల వల్ల ఆ స్థానంలోకి రమ్యకృష్ణ వచ్చారు. నటనలో తనదైన రాజసం చూపించి అదరగొట్టారు కూడా.

– సినిమా మేజర్‌ షూటింగ్‌ పార్ట్‌ అంతా రామోజీ ఫిలిం సిటీలోనే జరిగింది. చిత్రీకరణ జరిగిన ఐదేళ్ల పాటు సినిమాలోని ప్రధాన నటులు, సాంకేతిక నిపుణులు అక్కడి స్టార్‌ హోటల్స్‌లోనే ఉన్నారు. 125 అడుగుల భల్లాల దేవ విగ్రహాన్ని ఇక్కడే రూపొందించారు.

– బాహుబలి, అవంతిక మధ్య వచ్చిన మంచు పర్వతం సీన్స్‌ అన్నీ బల్గేరియాలో తెరకెక్కించారు. వాటర్‌ ఫాల్స్‌ సీన్స్‌ కేరళలోని అతిరాపల్లిలో తెరకెక్కించారు. ఈ సినిమా కోసం ప్రభాస్‌ రూ.26 కోట్ల రెమ్యూనరేషన్‌ అందుకోగా, రానాకు రూ.20 కోట్లు ఇచ్చారు అని సమాచారం. పదేళ్ల క్రితం ఈ అమౌంట్‌ ఎక్కువే.

– సినిమా విజువల్‌ ఎఫెక్ట్స్‌ సీన్స్‌ కోసం 15 మంది వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీల్లో 800 మంది టెక్నీషియన్లు పని చేశారు. సినిమా వీఎఫ్‌ఎక్స్‌ కోసం మొత్తంగా రూ.85 కోట్ల వరకు ఖర్చయిందని సమాచారం.

– కాలకేయులు, మాహిష్మతి మధ్య జరిగిన యుద్ధం సన్నివేశాలను సుమారు 120 రోజుల పాటు చిత్రీకరించారు. కాలకేయుల కిలికిలి భాషను ప్రముఖ తమిళ రచయిత మదన్‌ కార్కి రూపొందించారు.

– సినిమా ప్రచారంలో భాగంగా 50 వేల చదరపు అడుగుల ‘బాహుబలి’ భారీ పోస్టర్‌ను కొచ్చిలో ఆవిష్కరించారు. ఇది గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. సినిమా ఆడియో రిలీజ్‌ సందర్భంగా ఈ ఫీట్‌ చేశారు.

– లండన్‌లోని ప్రఖ్యాత రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ‘బాహుబలి’ సినిమాను ప్రదర్శించారు. అక్కడ ప్రదర్శినతమైన తొలి ఆంగ్లేతర సినిమా ‘బాహుబలి’ కావడం గమనార్హం. బుసాన్‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలోనూ ఈ సినిమా ప్రదర్శితమైంది.

– ఈ సినిమాలో బాహుబలి, భల్లాల దేవ పట్టుకునే ఆయుధాలు, ఇతరుల ఆయుధాలతో కలిపి మొత్తంగా 20 వేల ఆయుధాలను సాబు సిరిల్‌ రూపొందించారు. ‘బాహుబలి’గా శివగామి నదిలో ఎత్తుకున్న బిడ్డ ఆడబిడ్డ కావడం గమనార్హం.

– ‘బాహబలి 3’ సినిమా ఉంటుంది అని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. మధ్యలో ‘బాహుబలి 3’ని ఓ వెబ్‌ సిరీస్‌గా లేదంటే కామిక్‌ మూవీగా చేస్తారని వార్తలూ వినిపించాయి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus