22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

  • December 3, 2021 / 07:08 PM IST

సినిమా రంగంలో ఎవరికి ఎప్పుడు టైం వస్తుందో అంచనా వేయడం చాలా కష్టం. ఇప్పుడు స్టార్ దర్శకులుగా రాణిస్తున్న వారు, అలాగే హీరోలుగా రాణిస్తున్న వారు.. ఒకప్పుడు అవకాశాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన వాళ్ళే.. అలాగే చెప్పులు అరిగేలా స్టూడియోల చుట్టూ తిరిగిన వాళ్ళే..! ఇవన్నీ పక్కన పెట్టి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండీ వస్తే అన్నీ అవంతట అవే వచ్చేస్తాయా? అంటే దానికి కూడా పూర్తిగా అవునని చెప్పలేం. హీరోగా నిలదొక్కుకోవాలన్నా… టాప్ దర్శకుడిగా ఎదగాలన్నా ఎడతెగకుండా కష్టపడాల్సిందే. దానికి పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్ గా ‘నీకోసం’ చిత్రం గురించి చెప్పుకోవాలి.

1999 వ సంవత్సరం డిసెంబర్ 3న నీకోసం అనే చిత్రం విడుదలైంది. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఈరోజుతో ఈ చిత్రం విడుదలై 22 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1)శ్రీను వైట్ల ఇండస్ట్రీకి అడుగుపెట్టిన కొత్తలో దర్శకుడు తాతినేని రామారావు తెరకెక్కించిన ‘ప్రాణానికి ప్రాణం’ అనే చిత్రానికి అసిస్టెంట్ గా పనిచేసాడు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా టైంలోనే ‘నీకోసం’ అనే కథని రాసుకోవడం మొదలుపెట్టాడు. ఓ రకంగా ‘ప్రాణానికి ప్రాణం’ చిత్రానికి దర్శకుడు చేసిన తప్పులను అంచనా వేస్తూ ఈ కథని రాయడం మొదలుపెట్టాడు శ్రీను వైట్ల.

2) అసిస్టెంట్ గా పనిచేసిన మొదటి చిత్రమే డిజాస్టర్ కావడంతో ఇంకో సినిమాకి అవకాశం దొరుకుతుందా అనే అనుమానం శ్రీనువైట్లకి కలిగింది. అయినా నిరుత్సాహ పడకుండా అప్పటి క్రేజీ దర్శకుడు సాగర్ దగ్గర అవకాశం దక్కించుకుని ‘అమ్మదొంగ’ కి వర్క్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. అక్కడ పరిచయాలను పెంచుకుని ‘నీకోసం’ స్క్రిప్ట్ ను మరింతగా డెవలప్ చేసుకున్నాడు.

3) ‘అబ్బాయిగారు’ సినిమా దగ్గర్నుండీ రాంగోపాల్ వర్మ వంటి ఎంతో మంది దర్శకుల వద్ద శ్రీనువైట్ల పనిచెయ్యడం జరిగింది. రాంగోపాల్ వర్మ దగ్గర పనిచేస్తున్న టైములో రవితేజ పరిచయమయ్యాడు. అయితే నీకోసం సినిమాకి శ్రీను వైట్ల మొదట రవితేజని హీరోగా అనుకోలేదు.

4)జ.డి.చక్రవర్తితో ఈ సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అప్పుడు ‘గులాబీ’ అతని ఇమేజ్ పెరిగింది. అతని స్థాయికి శ్రీనువైట్ల సినిమా తీసేంతలా ఎదగలేదు. పైగా ఎస్వీ కృష్ణారెడ్డి వంటి అగ్ర దర్శకులు అతనితో వరుస సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు.

5) అయితే శ్రీను వైట్లకి అనుకోకుండా రాజశేఖర్, సాక్షి శివానందలతో ‘అపరిచితుడు’ అనే సినిమా చేసే అవకాశం దక్కింది. కానీ ఆర్ధిక లావాదేవీల కారణంగా ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.

6)కానీ శ్రీను వైట్లకి పెరిగిన పరిచయాల కారణంగా తన దగ్గర రెడీగా ఉన్న కథ(‘నీకోసం’) చేయడానికి ఓ బృందం రెడీ అయ్యింది. శ్రీను వైట్లకి రూ.40 లక్షలు బడ్జెట్ పెట్టే నిర్మాత మాత్రమే దొరికాడు కాబట్టి.. అప్పటికి సెకండ్ హీరోగా చేస్తున్న తన స్నేహితుడు రవితేజ ని హీరోగా పెట్టుకున్నాడు.

7) మొదట ఈ చిత్రాన్ని 28 రోజుల్లో పూర్తిచేయాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల 8 నెలల వరకు టైం పట్టింది. ఒక్క హీరోయిన్ మహేశ్వరి తప్ప మిగిలిన వాళ్లకి అంత క్రేజ్ లేదు అప్పట్లో..!

8) అయినా ధైర్యం చేసి ముండదు వేశారు. మ్యూజిక్ డైరెక్టర్ గా మొదట ఒకర్ని అనుకుంటే… తర్వాత ఆర్.పి.పట్నాయక్ అనే కొత్త కుర్రాడు వచ్చాడు.

9) సినిమాని రూ.55 లక్షల బడ్జెట్ లో పూర్తిచేశారు. ప్రివ్యూ చూసిన రామోజీరావు గారు రూ.80 లక్షలకి తెలుగు రాష్ట్రాల్లో రైట్స్ ను కొనుగోలు చేశారు. ఫుల్ రనలో ఈ సినిమా రూ.1 కోటి వరకు కలెక్ట్ చేసింది.

10) ‘నీ కోసం’ హిట్ అవ్వడంతో శ్రీను వైట్లకి తన బ్యానర్లో ‘ఆనందం’ సినిమా చేసే అవకాశం ఇచ్చారు రామోజీరావు గారు. అలాగే రవితేజకి ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చేసే అవకాశం దక్కింది. ఇక ఆర్.పి.పట్నాయక్… కు ‘చిత్రం’ ‘నువ్వు నేను’ ‘మనసంతా నువ్వే’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

ఇలా ‘నీ కోసం’ సినిమా ముగ్గురికి లైఫ్ ఇచ్చింది. కానీ సినిమాలో ‘కామెడీ లేదు .. అది కూడా ఉంటే బాగుణ్ణు’ అంటూ నాగార్జున గారు శ్రీను వైట్లకి చెప్పారట. అప్పటికి రాంగోపాల్ వర్మ,కృష్ణవంశీ ల దగ్గర పనిచెయ్యడం వలన అనుకుంట శ్రీను వైట్ల వాళ్ళ స్టైల్లో ‘నీకోసం’ చేసాడు. నాగార్జున కామెంట్స్ తో అంతకు ముందు సాగర్,ఇ.వి.వి వంటి కామెడీ చిత్రాలను తెరకెక్కించే స్టార్ దర్శకుల దగ్గర పనిచేశానని గుర్తుచేసుకుని వాళ్ళ స్టయిల్లో కామెడీ టచ్ ఉన్న చిత్రాలు చేయడం మొదలుపెట్టి స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus