ఇండియన్ సినిమాని ఒక ఊపు ఊపిన హీరోయిన్‌లలో మాధురి దీక్షిత్ ఒకరు. 80, 90..ల టైంలో మాధురి క్రేజ్ ఓ రేంజ్‌లో ఉండేది. కుర్రాళ్ల కలల రాకుమారిగా , డ్రీమ్ గర్ల్‌గా పిచ్చెక్కించారు మాధురి. నాటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు శ్రీదేవి (Sridevi), జయప్రద (Jaya Pradha), రేఖ (Rekha), జూహీ చావ్లా (Juhi Chawla) వంటి భామల కెరీర్ ముగుస్తున్న దశలో ఎంట్రీ ఇచ్చిన మాధురి దీక్షిత్ .. బాలీవుడ్‌కు ఐకాన్‌గా మారారు.అయితే మాధురి దీక్షిత్ (Madhuri Dixit) కూడా తొలినాళ్లలో ఎన్నో అవమానాలు పడ్డారు.
‘నీ ఫేస్ అద్దంలో చూసుకున్నావా?’, ‘నీ గొంతుకి సినిమాల్లో అవకాశాలు రావని వెక్కిరించారు. కానీ అవమానాలను ఎదుర్కొంటూనే పరిశ్రమలో నిలదొక్కుకున్నారు మాధురి. తాను తొలినాళ్లలో పడ్డ ఇబ్బందులను ఆమె పలు ఇంటర్వ్యూలలో చెప్పుకుని ఎమోషనల్ అయ్యారు. హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టిన తర్వాత నానా కష్టాలు పడి నాలుగు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు మాధురి దీక్షిత్. కానీ దురదృష్టవశాత్తూ ఆ సినిమాలు ఆలస్యంగా సెట్స్‌కి వెళ్లడంతో పాటు రిలీజ్ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురై విడుదలకు నోచుకోలేదు.
అసలే సెంటిమెంట్స్, లక్ మీద నడిచే సినీ పరిశ్రమలో ఈ దెబ్బతో మాధురి దీక్షిత్‌పై (Madhuri Dixit) ఐరన్ లెగ్ ముద్ర పడింది. అవకాశాల కోసం పలువురు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్లినా ఎవ్వరూ ముందుకొచ్చి ఛాన్స్ ఇవ్వలేదు. పైగా ఘోరంగా అవమానించి పంపించేవారు. ఇలాంటి టైంలో ఓ తెలుగు దర్శకుడు మాత్రం మాధురితో సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. ఆయనే సింగీతం శ్రీనివాసరావు. ‘పుష్పక విమానం’ సినిమాలో హీరోయిన్ కోసం మొదట ఆయన తీవ్రంగా గాలించడం జరిగింది.
ఈ క్రమంలో ఓ మిత్రుడి సలహా మేరకు మాధురిని కలిసేందుకు సింగీతం వెళ్లగా.. మా హీరోయిన్ అలాంటి సినిమాలు చేయదని మాధురి మేనేజర్ తిప్పిపంపాడట. దీంతో ఆ అవకాశం అమలను వరించింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో మాధురి మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నట్టు అయ్యింది. అయితే మాధురి స్టార్ హీరోయిన్‌గా మారిన తర్వాత సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫూల్’ లో నటించారు. ఆ సినిమా షూటింగ్ టైంలో.. ఓ రోజు ‘పుష్పక విమానం’ సినిమా సమయంలో జరిగిన సంఘటనను మాధురితో సింగీతం ప్రస్తావించగా.. ఆమె షాక్ అయ్యిందట. అదీ మేటర్.