కొంతమంది నటీ నటులు, హీరోలు.. అత్యున్నత స్థాయికి చేరుతున్న సమయంలో మరణించడం వారి కుటుంబ సభ్యులనే కాదు ప్రతీ ప్రేక్షకుడిని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేస్తూ ఉంటుంది. సౌందర్య, ఉదయ్ కిరణ్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వంటి వార్ల లిస్ట్ లో నటుడు అచ్యుత్ కూడా ఉంటాడు అనడంలో అతిశయోక్తి లేదు. 1990లలో ఈయన సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ మరో పక్క సీరియల్స్ లో హీరోగా చేస్తూ దూసుకుపోయేవాడు. ఇతను సినిమాల్లోకి రావడానికి చిరంజీవి గారే ఇన్స్పిరేషన్ అని ఆ రోజుల్లో అందరికీ చెప్పేవాడు. మెగాస్టార్ తో కలిసి ‘హిట్లర్’ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు అచ్యుత్ ఆనందానికి హద్దులు లేవని కూడా తెలిపాడు.
తరువాత మెగాస్టార్ కూడా ఈయన్ని మెచ్చుకోవడం తరువాత ‘బావగారు బాగున్నారా’ ‘డాడీ’ సినిమాల్లో కూడా అవకాశాలు ఇవ్వడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ‘గోకులంలో సీత’ ‘తొలిప్రేమ’ ‘తమ్ముడు’ వంటి చిత్రాల్లో అవకాశాలు ఇచ్చాడు. ఇతన్ని చూస్తుంటే నిజంగానే సొంత అన్నయ్యను చూసినట్టు అనిపిస్తుంది అని పవన్ కళ్యాణ్ కూడా చాలా సార్లు చెప్పేవాడట. అలాంటి అచ్యుత్ 42 ఏళ్లకే మరణించడం.. అది కూడా కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడు మరణించడం అందరినీ బాధపెట్టింది.
2002 డిసెంబర్ 26న అచ్యుత్ మరణించాడు. ఇతను సినిమాల్లో సంపాదించిందంతా వ్యాపారాల్లో పెట్టాడట. కానీ స్నేహితులు వల్ల ఆ వ్యాపారాలు దెబ్బ తినడం.. అప్పులు పాలైపోవడంతో.. మానసిక ఒత్తిడి పెరిగి గుండె పోటుతో మరణించినట్టు తెలుస్తుంది. అచ్యుత్ పూర్తి పేరు కూనపరెడ్డి అచ్యుత వర ప్రసాద్. ఇతని సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన మచిలీపట్నం. ఇతని భార్య పేరు రామా దేవి. ఇతనికి ఇద్దరు కూతుర్లు.. వాళ్ళ పేర్లు సాయి సుజాత,సాయి శివాని కావడం విశేషం.