గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!

  • September 15, 2020 / 03:16 PM IST

బిగ్‌బాస్‌ అంటే కుటుంబమంతా చూసే షో… మరి అలాంటప్పుడు కేవలం యూత్‌ మాత్రమే పార్టిసిపెంట్స్‌గా ఉండాలా? మీకూ ఇలాంటి డౌటే వచ్చిందా? మీకే కాదు బిగ్‌బాస్‌ టీమ్‌కి కూడా ఇదే ఆలోచన వచ్చింది… అందుకే గంగవ్వను స్పెషల్‌ పార్టిసిపెంట్‌గా తీసుకొచ్చింది. మొన్న లాంఛింగ్‌ ఎపిసోడ్‌లో ఆమె ఎంట్రీ చూడగానే కొందరు స్టన్‌. ఇంకొందరైతే ఒకటి రెండు రోజులు ఉంచి పంపేస్తారులే అనుకున్నారు. కానీ అక్కడ ఉన్నది ఎవరు? గంగవ్వ!. జీవితాన్నే జయించి యూట్యూబ్‌ స్టార్‌ అయిన సూపర్‌ స్పెషల్‌ అవ్వ. అందుకే యూత్‌తో పోటీ పడి మరీ బిగ్‌బాస్‌లో నిలుస్తోంది.. ఎంటర్‌టైన్‌ చేస్తోంది. మరి అలాంటి గంగవ్వ గురించి అందరికీ తెలియని కొన్ని విషయాలు మీ కోసం….

పదేళ్ల వయసులోనే…

గంగవ్వ పూర్తి పేరు మిల్కూరి గంగవ్వ. ఊరు జగిత్యాల జిల్లా లంబాడిపల్లి. పదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు. గంగవ్వను, ఆమెను మేనత్తే పెంచింది. పెద్ద తమ్ముడి బాధ్యతను అమ్మమ్మ తీసుకుంది. కొన్నాళ్లకు గంగవ్వకు మేనత్త కొడుకుతోనే పెళ్లి చేశారు. ఊహ తెలియక ముందే తండ్రి చనిపోయాడు. 13 ఏళ్లొచ్చాక తల్లి ప్రాణాలు విడిచింది. మరోవైపు భర్త తాగుడుకు బానిస కావడంతో.. రోజూ గొడవలే. పగలు కూలి పనులకు వెళ్తూ.. రాత్రి బీడీలు చుట్టేది. అలా ఇద్దరు కూతుళ్లు, కొడుకును పెంచడానికి చాలా కష్టాలు పడింది. 15 ఏళ్ల క్రితం గల్ఫ్‌కి వెళ్లిన భర్త నయా పైసా పంపలేదు. ఆ తర్వాత కూడా గల్ఫ్‌ నుండి ఎలాంటి సమాచారం లేకపోయే సరికి… ఆయన అక్కడే చనిపోయాడని తెలిసింది. గంగవ్వకు ఎనిమిది మంది మనవలు, మనవరాళ్లు. అన్నట్లు గంగవ్వకు తన అసలు వయసెంతో కూడా తెలీదు. సుమారు 58 ఏళ్లు ఉండొచ్చని ఓ లెక్క.

బిడ్డను ఎత్తుకున్నాననుకుంది…

గంగవ్వ చిన్న కుమార్తె అనిత (8)కు జ్వరం వచ్చిందని జగిత్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించింది. వారం రోజుల తర్వాత డాక్టర్‌ చెప్పారని బిడ్డను ఇంటికి తీసుకెళ్లడానికి బస్టాండ్‌కు వచ్చింది. అప్పటికే బిడ్డ మెడ వేలాడుతుండటంతో.. అక్కడున్న కొందరు ‘చనిపోయిన బిడ్డను ఎత్తుకున్నావెందుకు’ అని అడిగారు. దానికి గంగవ్వ ‘నా బిడ్డ చనిపోలేదు.. నిద్ర పోతోంద’ని చెప్పింది. చనిపోతేనే ఇలా మెడ, కాళ్లు వేలాడుతాయని చెప్పడంతో.. కిందకు దింపి చూసే సరికి బిడ్డ చనిపోయిందని తెలిసింది. దీంతో గంగవ్వ బస్టాండ్‌లోనే రోదించింది. ఆమె ఏడుపు చూసి అక్కడివాళ్ల మనసు తరుక్కుపోయింది. ఈ విషయాన్ని ఇటీవల గంగవ్వే చెప్పింది.

హుషారుతనం చూసి…

పల్లెటూరి సంస్కృతిని చాటేలా లంబాడిపల్లికి చెందిన శ్రీకాంత్ అనే కుర్రాడు ‘మై విలేజ్‌ షో’ అనే యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తుండేవాడు. ఓ రోజు తమ ఇంటి సమీపంలో ఉన్న గంగవ్వ హుషారుతనం చూసి ఆమెతో వీడియోలు చేస్తే బాగుండు అనుకున్నాడు. గంగవ్వ చలాకీతనం, అచ్చ తెలంగాణ యాస శ్రీకాంత్‌కు బాగా నచ్చాయి. నెటిజన్లను బాగా ఆకర్షిస్తాయి అని అనుకున్నాడు. దీంతో తన చానల్‌లో నటింపజేశాడు. కట్‌ చేస్తే ఇప్పుడు ‘గంగవ్వ లేకపోతే షో లేదు’ అనేంతగా పరిస్థితి మారింది. గంగవ్వ కెమెరా ముందు మాట్లాడితే.. మనతో మాట్లాడుతున్నట్లే ఉంటుంది. అంత నేచురల్‌గా ఉంటుంది నట. గంగవ్వ నటనకు జనం ఫిదా అయ్యి… ఆ యూట్యూబ్‌ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఛానల్‌కు 16.7 లక్షల మందికిపైగా ఆ ఛానల్‌ను సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

“నన్ను చూడటానికి రోజూ ఎంతో మంది మా ఇంటికి వస్తున్నారు. చుట్టుపక్కల ఊళ్లల్లో పెళ్లిళ్లు జరిగితే అక్కడ్నుండి కూడా గంగవ్వ ఇల్లెక్కడ అంటూ వస్తున్నారు. నేను చదువుకోలేదు. వీడియోలు చేసేటప్పుడు సీన్‌ ఏంటి, ఏం మాట్లాడాలి అని శ్రీకాంత్, అనిల్, అంజి వివరిస్తారు. వాళ్లు చెప్పింది విని నాకు తెలిసినట్లు చెబుతా. పాత్రకు తగ్గట్టు నేను మారిపోయి నటిస్తా. పిల్లల పెళ్లిళ్లు చేయడానికి అప్పులు చేశాను. ఈ వీడియోల ద్వారా వచ్చే డబ్బుతో వాటిని తీర్చాను. త్వరలో ఓ ఇల్లు కట్టుకుంటాను’’
– గంగవ్వ

100 దాటేశాయి…

మై విలేజ్‌ షోలో గంగవ్వ ఇప్పటివరకు వందకుపైగా షార్ట్‌ ఫిల్మ్‌/వెబ్‌ వీడియోస్‌లో నటించింది. ‘మల్లేశం’, ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాల్లో నటించింది. బీబీసీ ఛానల్‌తో కలసి కాళేశ్వరం ప్రాజెక్టుపై వీడియో చేసింది. ప్రాజెక్టు వల్ల కలిగే లాభాలు, నష్టపోయిన వారి బాధలను ఆ వీడియోలో వివరించింది. ప్రముఖ డైరక్టర్‌ పూరి జగన్నాథ్, సమంత, యంగ్‌ స్టార్‌ విజయ్‌దేవరకొండను కలసి ఇంటర్వ్యూ వీడియోలు కూడా చేసింది. గంగవ్వకు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఫాలోయింగ్‌ పెరుగుతోంది. ఆమె అకౌంట్‌ను 81 వేల మందికిపైగా ఫాలో అవుతున్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గంగవ్వకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉమెన్ అచీవర్ పురస్కారం అందించారు.

“మనమీద మనకు నమ్మకం ఉంటే ఏ పని చేసినా మంచిగనే ఉంటాం” – ఇదీ గంగవ్వ సిద్ధాంతం. ఇలానే అందరూ ఆలోచిస్తే… గంగవ్వలా ఏదైనా సాధిస్తారనడంలో అతిశయోక్తి లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus