మనకు తెలియని ప్రియదర్శి

  • September 29, 2017 / 12:00 PM IST

‘నా సావు నేను సస్తా… నీకెందుకు’.. మనలోని అసహనాన్ని, బాధను వ్యక్తం చేయడానికి ఉపయోగించే వాఖ్యం. దీనిని విభిన్నంగా చెప్పి హాస్యాన్ని కురిపించారు ప్రియదర్శి. ఒక్క సినిమాతో అందరికీ గుర్తుండిపోయారు. పెళ్లిచూపులు సినిమాలో ఇతని నటనను చూసిన ఫిలిం మేకర్స్ అవకాశాలతో ముంచెత్తారు. కేశవ, యుద్ధం శరణం వంటి యువ హీరోల సినిమాతో పాటు స్పైడర్, జై లవకుశ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. నేటి కమెడియన్ గా పేరుతెచ్చుకున్న ప్రియదర్శి వెండితెరపై కనిపించడానికి జరిగిన జర్నీ..

పేరు – పుట్టుక ప్రియదర్శి తండ్రి పులికొండ సుబ్బాచారి సొంతూరు ఖమ్మం. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన జయమ్మ(ప్రియదర్శి తల్లి)ని పెళ్లి చేసుకున్నారు. ప్రియదర్శి పుట్టింది పిడుగురాళ్లలోనే అయినా హైదరాబాద్‌లో పెరిగారు. సుబ్బాచారికి సాహిత్యంపై ఆసక్తికి ఎక్కువ. అందుకే తన తండ్రి పిచ్చయ్యచారి పేరు కలిసి వచ్చేలా కొడుక్కి ప్రియదర్శి అని పేరు పెట్టారు.

మ్యాథ్స్ – స్టాటిస్టిక్స్‌ఎం.ఎన్‌.ఆర్‌. డిగ్రీ కాలేజీలో ప్రియదర్శి బీఎస్సీ కంప్యూటర్స్‌ చదివేటప్పుడు సినిమాలు ఎక్కువగా చూడడం వల్ల… మార్కులు వచ్చేవికావు. అందుకే మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌ కోసం ట్యూషన్‌ పెట్టించారు. అయినా కూడా లెక్కలు బుర్రకెక్కేవి కావు. డిగ్రీలో రెండు సబ్జెక్టులు మిగిలాయి. అష్టకష్టాలు పడి ఆ సబ్జెక్టుల్లో పాస్ మార్కులు తెచ్చుకున్నారు.

డ్రీమ్ – రియల్ ప్రియదర్శికి పుణే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలనుకున్నారు. మధ్యతరగతి కుటుంబాల్లో చదువే బుక్కెడు అన్నం పెడుతుంది కానీ మిగతావి పనికిరావని తన తండ్రి పదే పదే హెచ్చరించడంతో యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లోనే మాస్‌ కమ్యూనికేషన్‌ కోర్చులో చేరారు.

సినిమా – సంపాదన మాస్‌ కమ్యూనికేషన్‌లో భాగంగా రైటింగ్‌, షార్ట్‌ఫిల్మ్స్‌ మేకింగ్‌లో ప్రియదర్శికి అవగాహన పెరిగింది. ఆ అనుభవంతో ‘పిక్సలాయిడ్‌’ సంస్థలో అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌గా నెలకు 9 వేల జీతంతో ఉద్యోగం సంపాదించారు.

యాక్షన్ – డైరక్షన్ సినిమాల గురించి ఆలోచన పెరగడంతో కథలు రాసుకోవడం, వాటిని తెరకెక్కించాలనే కోరికతో దర్శకత్వ శాఖలో ఉద్యోగం కోసం అడుగులు వేశారు. కొంత కాలానికే అదంతా సులువు కాదని తెలుసుకొని షార్ట్‌ఫిల్మ్స్‌ వైపు దృష్టి సారించారు. ఉద్యోగం వదిలేసి కార్పోరేట్‌ యాడ్స్‌, పెళ్లిళ్లకు వీడియో షూటింగులు చేసేవారు. వచ్చిన ఆదాయంతో అరడజను దాకా షార్ట్‌ఫిల్మ్స్‌ తీశారు.

ఫస్ట్ ఛాన్స్ – ఎన్నో మిస్షార్ట్‌ఫిల్మ్స్‌ తీస్తూనే నటుడిగా అవకాశలకోసం ప్రియదర్శి తిరిగేవాడు. తొలి సారి ‘బైపాస్‌ రోడ్‌ ఎల్‌ఎండీ కాలనీ’ సినిమాలో నటుడిగా ఫస్ట్ ఛాన్స్ వచ్చింది. అందులో మంచి పాత్ర చేశాడు. కానీ అది విడుదల కాలేదు. ఆ తర్వాత కూడా ఐదారు సినిమాల్లో నటించాడు. అవి కూడా రిలీజ్ కాలేదు.

టెర్రర్ – నో ఫియర్ శ్రీకాంత్‌ హీరోగా దర్శకుడు సతీష్‌ కాశెట్టి తీసిన ‘టెర్రర్‌’ సినిమాలో ప్రియదర్శి తొలిసారి వెండితెరపై కనిపించారు. అందులో ప్రియదర్శి విలన్‌గా నటించాడు. అతని నటనని చూసిన పేరెంట్స్‌ ‘పర్వాలేదు వీడు సినిమాలకు పనికివస్తాడ’ని భావించారు.

పెళ్లి చూపులు – ఎదురుచూపులు అవకాశాల ఎదురుచూపులను పెళ్లి చూపులు సినిమా పోగొట్టింది. ఇందులో హీరో ఫ్రెండ్ గా ప్రియదర్శి నవ్వించారు. ‘పెళ్లిచూపులు’ సినిమా దెబ్బకి ఒక ఏడాదిలో 25 సినిమాలకు ప్రియదర్శి సైన్ చేశారు.

కోరిక – కల తెలంగాణ యాసతో కూడిన పాత్రలే కాకుండా అన్ని రకాల పాత్రలు చేయాలనేది ప్రియదర్శి కోరిక. ఎప్పటికైనా సినిమా డైరెక్ట్‌ చేయాలనేది అతని కల.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus