సినిమా పరిశ్రమలో పోటీ అనేది కామన్. అదే పోటీ తండ్రీ కొడుకుల మధ్య ఉంటే.. ఆ మధ్యలోకి బాబాయి కూడా వస్తాడని తేలితే ఆ పోటీ ఇంకా ఇంకా అదిరిపోతుంది కదా. ఇప్పుడు టాలీవుడ్‌లో ఆ పరిస్థితే ఉంది. ఓవైపు ‘మీసాల పిల్ల’ అంటూ శివ శంకర్ వరప్రసాద్ (చిరంజీవి) తన మాజీ భార్యను ఆటపట్టిస్తుంటే.. మరోవైపు ‘చికిరి.. చికిరి’ అంటూ తన ప్రేయసి వెనుక పెద్ది (రామ్‌చరణ్) పడుతున్నారు. ఈ ఇద్దరూ కలసి రికార్డులు తిరగరాస్తుంటే.. మధ్యలో ఉస్తాద్ (పవన్ కల్యాణ్) మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో వస్తాడని టాక్.
‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా టీమ్ ఇటీవల రిలీజ్ చేసిన ‘మీసాల పిల్ల’ పాట్ యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం, ఉదిత్ నారాయణ్ వాయిస్, చిరంజీవి గ్రేస్ కలసి ఈ ఈ పాట ఇప్పటికీ ట్రెండ్ అవుతోంది. 50కిపైగా మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్‌లో ఈ పాట దూసుకుపోతోంది. ఈ రికార్డును చిరు తనయుడు రామ్‌చరణ్ రెండు రోజుల్లోనే బ్రేక్ చేసేశాడు. ‘చికిరి చికిరి’ అంటూ వచ్చి తన మాస్ మూమెంట్స్‌తో అలరిస్తున్నాడు.
‘పెద్ది’ సినిమాలోని చికిరి పాట తక్కువ సమయంలోనే 50 మిలియన్లకుపైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది. దీంతో ఓ అభిమాని సోషల్ మీడియాలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా టీమ్‌ను ట్యాగ్ చేసి ‘మీసాల పిల్ల..’ హిట్.. ‘చికిరి చికిరి..’ హిట్.. నెక్స్ట్ మనమే’ అని రాసుకొచ్చాడు. దానికి ఆ సినిమా సోషల్ మీడియా టీమ్ రియాక్ట్ అయింది. ఆ రియాక్షనే ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘అదే పనిలో ఉన్నాం. మీ అంచనాలు పెంచుకోండి’ అని రాసుకొచ్చింది.
నిజానికి ఈ నెల 31న ఓ పార్టీ సాంగ్‌ను రిలీజ్ చేయాలని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా టీమ్ అనుకుంటోందని సమాచారం. ఇటీవల టీ్ రిలీజ్ చేసిన మైఖేల్ జాక్సన్ స్టైల్ పవన్ కల్యాణ్ లుక్ అందులోనిదే అని చెబుతున్నారు కూడా. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఓ కొలిక్కి వస్తే రిలీజ్ డేట్ ప్రకటిస్తారట.