Vadhuvu Review in Telugu: వధువు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

  • December 8, 2023 / 03:25 PM IST

Cast & Crew

  • నందు (Hero)
  • అవికా గోర్ (Heroine)
  • అలీ రెజా, రూపా లక్ష్మి, మౌనిక, మాధవి ప్రసాద్, శ్రీధర్ రెడ్డి తదితరులు (Cast)
  • పోలూరు కృష్ణ (Director)
  • శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని (Producer)
  • శ్రీరామ్ మద్దూరి (Music)
  • రామ్ కె మహేశ్ (Cinematography)

‘చిన్నారి పెళ్లి కూతురు’ ఫేమ్ అవికా గోర్ కి మంచి క్రేజ్ ఉంది.ఆల్రెడీ బుల్లితెర పై సత్తా చాటి బోలెడంత మంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తర్వాత హీరోయిన్ గా కూడా మారి ‘ఉయ్యాలా జంపాలా’ ‘సినిమా చూపిస్తా మావ’ వంటి హిట్ సినిమాల్లో కూడా నటించింది. అటు తర్వాత డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చి ‘నెట్’ వంటి వైవిధ్యమైన సినిమాలో నటించింది. ఇక అవికా గోర్ నుండి వచ్చిన మరో ఓటీటీ ప్రాజెక్టు ‘వధువు’. ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ప్రేక్షకులను ఇది ఆకట్టుకునే విధంగా ఉందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి :

కథ : పెళ్లీడుకొచ్చిన అమ్మాయి ఇందు (అవికా గోర్) పెళ్లి రకరకాల కారణాల వల్ల ఆగిపోతూ ఉంటుంది. మొదట ఆమెకు కాబోయే భర్తను ఆమె సొంత చెల్లెలు లేవదీసుకుని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కూడా కొన్ని కారణాల వల్ల ఆమెకు వచ్చిన సంబంధాలు సెట్ అవ్వవు. అయితే తర్వాత ఆనంద్ (నందు)తో ఆమె పెళ్లి కుదురుతుంది. ఈ పెళ్లిని కూడా ఆపేయాలని కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. అయినప్పటికీ వీరి పెళ్లి జరుగుతుంది. అయితే తర్వాత ఇందుని చంపాలని ఎవరో ప్రయత్నిస్తూ ఉంటారు.

ఆమెకు బదులు ఒకసారి ఆమె ఆడపడుచు పై హత్యాప్రయత్నం చేస్తారు. మరోపక్క ఆనంద్ తమ్ముడు ఆర్య (అలీ రెజా) పెళ్లి కూడా పెటాకులు అవుతుంది. వీటన్నిటికీ కారణాలు ఏంటి? అసలు లింక్ ఏంటి? అనేది తెలుసుకోవాలి అంటే ‘వధువు’ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

నటీనటుల పనితీరు : అవికా గోర్ నటన గురించి కొత్తగా చెప్పడానికి ఏముంటుంది. ఆమె చిన్నప్పటి నుండి ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ సిరీస్ లో కూడా తన మార్కు నటనతో ఆకట్టుకుంది. అయితే ఎక్కువగా స్క్రీన్ ప్రెజెన్స్ తోనే ఆకట్టుకుంది అని చెప్పాలి. అలా అని కొత్తగా తనను తాను ఆవిష్కరించుకునే స్కోప్ ఉన్న పాత్రయితే ఇది కాదు. నందు ఎప్పటిలానే సింగిల్ ఎక్స్ప్రెషన్ తో లాగించేశాడు. అలీ రేజా నటన ఓకే అనిపిస్తుంది.

రూప లక్ష్మీ మళ్ళీ తన మార్కు నటనతో మెప్పించారు. ‘కోటబొమ్మాళి పీఎస్’ ఫేమ్ శ్రీధర్ రెడ్డి పోషించిన పోలీస్ పాత్ర పర్వాలేదు అనిపిస్తుంది. మిగిలిన నటీనటులు గుర్తుంచుకునే రేంజ్లో అయితే పెర్ఫార్మ్ చేసింది లేదు.

సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు పోలూరు కృష్ణ 7 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. కథ పెద్దగా లేని ఈ సిరీస్ కి.. దర్శకుడి టేకింగ్ కీలకంగా మారింది. వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయడం అంటే మాటలు కాదు. ప్రతి సిరీస్ కి చివర్లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్తున్న ఫీలింగ్ కలగాలి. అలాంటి ఓ మంచి హుక్ పాయింట్ అవసరం. లేదు అంటే ఆ వెబ్ సిరీస్ సీరియల్ ని తలపిస్తుంది. పోలూరు కృష్ణ ఈ వెబ్ సిరీస్ విషయంలో కొంత వరకు సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు.

స్టార్టింగ్ ఎపిసోడ్స్ బాగున్నాయి. చివరి మూడు ఎపిసోడ్స్ పెద్దగా ఆకట్టుకునే విధంగా ఉండవు. రామ్ కె మహేశ్ సినిమాటోగ్రఫీ ఈ సిరీస్ కి ఉన్న ప్లస్ పాయింట్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. శ్రీరామ్ మద్దూరి అందించిన నేపథ్య సంగీతం కూడా మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు ఓకే. కొన్ని విజువల్స్ క్వాలిటీగా అనిపిస్తాయి.

విశ్లేషణ : ‘వధువు’ (Vadhuvu) స్టార్టింగ్ ఎపిసోడ్స్ బాగానే ఉంటాయి. కొంత సస్పెన్స్ ను బాగానే మెయింటైన్ చేశారు. కానీ అటు తర్వాత స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది. వీకెండ్ కి ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

రేటింగ్ : 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus