విలక్షణ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది వరలక్ష్మి శరత్ కుమార్. కెరీర్ ఆరంభంలో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది. ఇప్పుడు లీడ్ రోల్స్ చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా సినిమాలు చేస్తోంది. తెలుగులో అయితే ఆమెకి అన్నీ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్సే వస్తున్నాయి. ‘క్రాక్’ సినిమాతో ఆమె క్రేజ్ పెరిగింది. ఈ సినిమా తరువాత తెలుగులో అవకాశాలు పెరిగాయి. ‘యశోద’ సినిమాలో కీలకపాత్ర పోషించింది వరలక్ష్మి.
ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. దీంతో సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. సరోగసీ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం సరోగసీ అనేది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మీ రియాక్షన్ ఏంటని వరలక్ష్మిని అడగ్గా.. సరోగసీ అనేది కాంప్లికేటెడ్ కాదని, కొంతమంది యాక్టర్స్ సరోగసీను ఆశ్రయించడం వలన చర్చ నడుస్తోందని అన్నారు.
పిల్లలు లేని చాలా మందికి సరోగసీ ద్వారా సంతానం పొందే ఛాన్స్ వస్తుందని అన్నారు. తమ సినిమాలో అయితే సరోగసీ అంశం టచ్ చేసినప్పటికీ.. అందులో మంచి, చెడుల గురించి చెప్పడం లేదని.. ‘యశోద’ ఒక ఫిక్షనల్ స్టోరీ అని చెప్పుకొచ్చారు. ఇటీవల స్టార్ హీరోయిన్ నయనతార సరోగసీ ద్వారా పిల్లలను కనడంపై విమర్శలు వచ్చాయి. ఈ విషయం కేసుల వరకు కూడా వెళ్లింది.
ఈ నేపథ్యంలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని చర్చనీయాంశం చేయడంపై మీ అభిప్రాయం ఏంటని వరలక్ష్మిని ప్రశ్నించగా.. పని పాట లేనివాళ్లే పక్కవాళ్ల లైఫ్ గురించి మాట్లాడుకుంటారని.. ఇప్పుడు సెలబ్రిటీల జీవితంలో సరోగసీ గురించి మాట్లాడుకుంటున్నారని.. అందరూ తమ జీవితాల గురించి పక్కన పెట్టి, పక్కవాళ్ల లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తితో ఉన్నారని మండిపడ్డారు. ఎలాంటి పని లేనివాళ్లే ఇలా చేస్తారని అసహనం వ్యక్తం చేశారు.