వరలక్ష్మి శరత్ కుమార్… ఇప్పుడొక బ్రాండ్. దక్షిణాది సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇప్పుడు వరుస విజయాలు అందుకుంటోంది. అయితే పదేళ్ల క్రితం అంటే.. వరలక్ష్మి ఉరఫ్ వరు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? ఏముంది నెపో కిడ్ కదా.. రెడ్ కార్పెట్ వేసి పిలిచుంటారు అనుకుంటున్నారా? అస్సలు కాదు. సగటు అమ్మాయి కంటే ఎక్కువ మాటలే పడింది. ఆమె పరిశ్రమలోకి వచ్చి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. అందులో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.
తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ గారాల పట్టిగా వరలక్ష్మి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అయితే ఇండస్ట్రీలోకి వస్తాను అంటే శరత్ కుమార్ ఒప్పుకోలేదని తన తల్లి, పిన్ని రాధిక ఒప్పించడంతో నాన్న ఒప్పుకున్నారని వరు గతంలో చెప్పింది. అలా ‘పోడా పోడి’ సినిమా వరు తెరంగేట్రం జరిగింది. అప్పటి నుండి ధైర్యం, సాహసంతో సినిమాలు చేస్తూనే… సాయం, సేవ వంటి గుణాలతో ఇటు సినిమాల్లోనూ, అటు వ్యక్తిగతంగానూ దూసుకుపోతోంది.
‘‘ఈ పదేళ్ల కెరీర్ అంత సులభంగా ఏమీ సాగలేదు. ప్రారంభంలో ఎన్నో అవమానాలు పడ్డాను. సినిమా ఛాన్స్‌ల కోసం చూస్తున్న సమయంలో తిరస్కారాలకు గురయ్యాను. బొద్దుగా ఉన్నావు, ముఖంగా ఆకర్షణీయంగా లేదు అంటూ ఎన్నో రకాలుగా అవమానించారు. అయితే అవేవీ నన్ను ఆపలేదు. అంతేకాదు ఆ సూటిపోటి మాటల నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. అలా ఈ 10 ఏళ్లలో 45 చిత్రాల్లో నటించాను’’ అంటూ తన కెరీర్ రీక్యాప్ చేసుకుంది వరు.
‘పోడా పోడి’ అనే తమిళ సినిమాతో కథనాయికగా ఇండస్ట్రీలోకి వరలక్ష్మి ఎంట్రి ఇచ్చింది . ఆ తరువాత ‘మాణిక్య’ అనే కన్నడ సినిమాలో నటించి గుర్తింపు సంపాందించి. ‘తెనాలి రామకృష్ణ’ సినిమాతో తెలుగులో నేరుగా ఫస్ట్ ఎంట్రీ ఇచ్చింది. అందులో ఆమె చూపించిన విలనిజానికి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత ‘క్రాక్’లో జయమ్మగా, ‘నాంది’లో ఆద్యగా అలరించింది. త్వరలో ‘వీర సింహా రెడ్డి’లో బాలకృష్ణకు చెల్లిగా నటిస్తోంది.