Varasudu Review In Telugu: వారసుడు సినిమా రివ్యూ & రేటింగ్!

  • January 14, 2023 / 12:32 PM IST

Cast & Crew

  • విజయ్ (Hero)
  • రష్మికా మందన్న (Heroine)
  • శరత్ కుమార్ , సత్యరాజ్ ,ప్రభు , ప్రకాశ్ రాజ్ , శ్రీకాంత్, జయసుధ , యోగిబాబు (Cast)
  • వంశీ పైడిపల్లి (Director)
  • దిల్‌రాజు , శిరీష్ ,పరమ్ వి పొట్లూరి , పెరల్ వి పొట్లూరి (Producer)
  • ఎస్.ఎస్. తమన్ (Music)
  • కార్తీక్ పళని (Cinematography)

తెలుగు చిత్రసీమలోని అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు.. తమిళనాట అడుగిడుతూ నిర్మించిన మొదటి సినిమా “వారిసు”. తమిళ సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాడులో జనవరి 11న విడుదల కాగా.. తెలుగు డబ్బింగ్ వెర్షన్ “వారసుడు” నేడు (జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి తెలుగు బృందం పండించిన ఆరవ సెంటిమెంట్ ఎంత వరకు వర్కవుటయ్యిందో చూద్దాం..!!

కథ: రాజేంద్రన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత రాజేంద్రన్ (శరత్ కుమార్)కు ముగ్గురు కొడుకులు. జై (శ్రీకాంత్), అజయ్ (శ్యామ్), విజయ్ (విజయ్). ఈ ముగ్గురిలో ఎవర్ని తన తదనంతరం వారసుడిగా ప్రకటిద్దామనే ఆలోచనలో ఉన్న రాజేంద్రన్ కు తాను ఎక్కువ కాలం బ్రతకనని తెలుస్తుంది.

దాంతో.. అప్పటివరకూ ఉన్న తన లెక్కలన్నీ మారిపోతాయి. అనంతరం రాజేంద్రన్ తన కుటుంబాన్ని, కంపెనీని కాపాడుకోవడం కోసం విజయ్ ను ఎందుకు వారసుడిగా ప్రకటించాడు? వారసుడిగా మారిన విజయ్ తన అన్నల మన్ననలు ఎలా అందుకున్నాడు? అనేది “వారసుడు” కథాంశం.

నటీనటుల పనితీరు: సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే.. ఏ ఒక్క పాత్ర కూడా కొత్తగా ఉండదు. ఆల్రెడీ మనం పదుల సార్లు చూసేసిన సినిమాలా కనిపించడమే కాక.. పాత్రలు కూడా అదే తరహాలో ఉంటాయి. శరత్ కుమార్ కి తండ్రి పాత్రలు పోషించడం కొత్త కాదు, ఇక శ్రీకాంత్ కు అన్నయ్య పాత్రలో మెప్పించడమూ కొత్త కాదు. రెండో అన్నగా శ్యామ్, తల్లిగా జయసుధ, వదినగా సంగీత.. ఇలా అందరూ ఈ చిత్రంలో పోషించిన పాత్రలను ఇప్పటికే ఒక 50 సినిమాల్లో చేసి ఉంటారు. వాళ్లందరినీ మళ్ళీ అవే పాత్రల్లో చూడడం ప్రేక్షకులకు కూడా పెద్ద కొత్తగా ఏమీ కనిపించదు.

ఇక విజయ్ పోషించిన పాత్ర కూడా కొత్తదేమీ కాదు. అయితే.. అతడి మ్యానరిజమ్స్ మాత్రం కాస్త అలరిస్తాయి. డ్యాన్సుల విషయంలోనూ ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాడు. యోగిబాబుతో కామెడీ సన్నివేశాలు ఒక వర్గానికి నచ్చే విధంగా ఉన్నాయి.

రష్మిక రెండు పాటల్లో విజయ్ తో కనిపించి.. మిగతా సినిమా మొత్తం బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ లా మిన్నకుండిపోయింది. లుక్స్ విషయంలోనూ ఆకట్టుకోలేకపోయింది.

ప్రకాష్ రాజ్ ఇప్పటికే కొన్ని వందలాసార్లు పోషించిన బడా బ్యాడ్ బిజినెస్ మ్యాన్ పాత్రలో ఎప్పట్లానే ఒదిగిపోయాడు.

సాంకేతికవర్గం పనితీరు: కార్తీక్ పళని సినిమాటోగ్రఫీకే సినిమా క్రెడిట్స్ లో అగ్ర తాంబూలం దొరుకుతుంది. ప్రతి సన్నివేశాన్ని ఎంతో క్లాసిక్ గా, దిల్ రాజు పెట్టిన ప్రతి రూపాయి కనిపించే విధంగా తెరకెక్కించాడు. సీజీ వర్క్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది.

తమన్ పాటలు పర్వాలేదనిపించినా.. నేపధ్య సంగీతం మాత్రం ఇప్పటికే చాలాసార్లు విన్న ఫీలింగ్ కలిగించింది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ సినిమాకి మేజర్ ఎస్సెట్. ముఖ్యంగా ఇల్లు సెట్ వర్క్ చాలా బాగుంది.

దర్శకుడు వంశీ పైడిపల్లి.. ఎక్కువ కష్టపడకుండా, తెలుగు, తమిళ భాషల్లో ఇదివరకు సక్సెస్ అయిన ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలన్నీ కలగలిపి “వారసుడు” కథను రాసేసుకున్నాడు. అయితే.. సినిమాలో ఎక్కువగా వెంకటేష్ నటించిన “లక్ష్మీ” ఛాయలు కనిపించడం తెలుగు వెర్షన్ వరకూ పెద్ద మైనస్. స్క్రీన్ ప్లే దగ్గర నుంచి సీన్ కంపోజిషన్ వరకూ చాలా చోట్ల లక్ష్మి సినిమా గుర్తొస్తుంది. అలాగే.. దర్శకుడిగా “ఊపిరి” చిత్రంతో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ సంపాదించుకున్న వంశీ.. “వారసుడు” సినిమాలో ఆ మార్క్ ఎక్కడా కనిపించకుండా లాక్కొచ్చేశాడు.

విశ్లేషణ: చిరంజీవి, బాలకృష్ణలు ఆల్రెడీ సంక్రాంతికి సిస్టర్/బ్రదర్ సెంటిమెంట్ తో కలగలిసిన యాక్షన్ ఎంటర్ టైనర్స్ తో అదరగొడుతున్న తరుణంలో.. బోలెడు తెలుగు సినిమాల రిఫరెన్సులు పుష్కలంగా ఉన్న విజయ్ “వారసుడు” మన ప్రేక్షకుల్ని మెప్పించడం కాస్త కష్టమే.

రేటింగ్: 2/5

Click Here To Read In ENGLISH

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus