వీడెవడు

  • September 15, 2017 / 11:05 AM IST

మల్టీ మిలియనీర్ కమ్ యాక్టర్ సచిన్ జోషి నటించిన సరికొత్త చిత్రం “వీడెవడు”. ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి “భీమిలి కబడ్డీ జట్టు” ఫేమ్ తాతినేని సత్య దర్శకుడు. బాలీవుడ్ డివా ఇషా గుప్తా కథానాయికగా నటించిన ఈ చిత్రం చాలా రోజులపాటు విడుదలకు నోచుకోక ల్యాబ్ లో మగ్గి ఎట్టకేలకు ఇవాళ బయటపడింది. హీరోగా పేరు తెచ్చుకోవడం కోసం తుగ్లక్ మహారాజు తరహాలో ఎప్పట్నుంచో దండయాత్రలు చేస్తున్న సచిన్ జోషికి ఈ కొత్త దండయాత్రైనా ఉపయోగపడిందో లేదో చూడాలి.

కథ : సత్య (సచిన్ జోషి) పెళ్లి చేసుకొన్న భార్యను ఫస్ట్ నైట్ రోజే దారుణంగా హతమార్చిన కేసులో గోవా జైలుకి 14 రోజుల రిమాండ్ కు తరళించబడతాడు. ఆ కేస్ డీల్ చేసే బాధ్యత పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రకాష్ (కిషోర్)కు అప్పగిస్తుంది. కేస్ ను స్టడీ చేయడం మొదలెట్టిన ప్రకాష్ కి సత్య హంతకుడు కాడని, ఈ హత్య వెనుక చాలా పెద్ద రహస్యం ఉందని తెలుసుకొంటాడు. ఏమిటా రహస్యం, అసలు ప్రేమించి పెళ్లాడిన యువతిని హత్య చేయాల్సిన పరిస్థితి సత్యకు ఎందుకు వచ్చింది? దాని వెనుక ఉన్నదెవరు అనేది “వీడెవడు” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.

నటీనటుల పనితీరు : తుగ్లక్ దండయాత్రల్లా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మదిలో ఒక కథానాయకుడిగా నిలిచిపోవాలని తన సినిమాలతో విశ్వప్రయత్నాలు చేస్తున్న సచిన్.. ఆ సినిమా తీయడం కోసం పడే శ్రమలో 10% అయినా హావభావాలు లేక యాక్టింగ్ కోసం పడి ఉంటే థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడు ఇబ్బందిపడేవాడు కాదు. ఇషా గుప్తా ఈ చిత్రంలో అందంగానూ కనిపించక.. నటనతోనూ ఆకట్టుకోలేక ఓ రెండు పాటలు అయిదారు సన్నివేశాలకు పరిమితమైంది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కిషోర్, అతని అసిస్టెంట్ గా హర్షవర్ధన్ లు సహజమైన నటనతో ఆకట్టుకొన్నారు. ఇంకా బోలెడుమంది ఆర్టిస్టులు ఉన్నప్పటికీ.. వాళ్ళు స్క్రీన్ ప్రేజన్స్ కోసం తప్పితే కథకి కనీస స్థాయిలో ఉపయోగపడలేదు.

సాంకేతికవర్గం పనితీరు : తమన్ ఎప్పట్లానే ఫ్యూజన్ మిక్స్ తో తన పాత ట్యూన్స్ నే కొత్తగా వినిపించేశాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలోనూ అంతే.. తమన్ పాత సినిమా పాటలు చాలా వినిపిస్తుంటాయి. బినేంద్ర మీనన్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాత రైనా జోషి మన హీరో సచిన్ జోషికి స్వయానా భార్య అవ్వడంతో.. ఖర్చు విషయంలో ఎక్కడా వెనకాడకుండా ఒక భారీ బడ్జెట్ సినిమా చూస్తున్న ఫీల్ ను ఆడియన్స్ కు కలిగించారు. బేసిక్ గా మంచి రైటర్ అయిన తాతినేని సత్య “వీడెవడు” కోసం రాసుకొన్న కథ బాగుంది. కానీ.. చాలా ఇంపార్టెంట్ లాజిక్స్ మిస్ అయ్యాడు. థ్రిల్లర్ జోనర్ సినిమాలకు చాలా ఇంపార్టెంట్ అయిన స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా పెద్ద మైనస్. సో, ఒక రైటర్ గా బొటాబోటి మార్కులతో పాసైన తాతినేని సత్య.. డైరెక్టర్ గా మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాడు.

విశ్లేషణ : “చిక్కు ముడులు వేయడం” చాలా సులువైన పని.. కానీ ఆ మూడులను విప్పడమే కష్టమైన పని. ట్విస్ట్స్ ని బాగానే ప్లాన్ చేసుకొన్న చిత్ర బృందం ఆ ట్విస్ట్స్ ను రివీల్ చేసే సమయంలో కాస్త గట్టిగానే తడబడ్డారు. దాంతో.. ఓ మోస్తరు సినిమాగా మిగలాల్సిన “వీడెవడు” బిలో యావరేజ్ గా మిగిలిపోయింది.

రేటింగ్ : 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus