వెంకటాపురం

“హ్యాపీ డేస్” సినిమాలో “శ్రావ్స్.. శ్రావ్స్” అంటూ సోనియా వెంటతిరిగిన టైసన్ గానే ఇంకా ప్రేక్షకుల మనసుల్లో చెరగని సంతకం చేసిన రాహుల్ కొన్నేళ్ళ విరామం అనంతరం మరోమారు కథానాయకుడిగా నటించిన సినిమా “వెంకటాపురం”. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పబ్లిసిటీ పుణ్యమా అని మంచి క్రేజ్ సంపాదించుకొంది. మరి పబ్లిసిటీ స్థాయిలో సినిమా ఉందా లేదా అనే విషయం తెలియాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే..!!

కథ : చైత్ర (మహిమా మక్వాన) ఇంజనీరింగ్ విద్యార్ధిణి. చాలా చురుగ్గా ఉండే ఈ అమ్మాయి ఉన్నట్లుండి హత్య చేయబడుతుంది. ఆ హత్య కేసులో ఆనంద్ (రాహుల్)కు సంబంధం ఉందని పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అయితే.. నిజానికి ఆనంద్-చైత్రలు ఒకర్నొకరు ఇష్టపడి ప్రేమించుకొంటారు. అంత ఘాడంగా ప్రేమించిన అమ్మాయిని ఆనంద్ ఎందుకు హత్య చేస్తాడు? అందుకు ప్రేరేపించిన కారణాలేమిటి? వంటి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమే “వెంకటాపురం”.

నటీనటుల పనితీరు : ఆనంద్ పాత్రలో రాహుల్ “విగ్రహపుష్టి నైవేద్య నష్టి” అన్న చందాన కష్టపడి చేసిన సిక్స్ ప్యాక్ బాడీ తప్ప మొహంలో భూతద్దం పెట్టి వెతికినా ఎక్స్ ప్రెషన్స్ కనపడకపోవడం సినిమాకి పెద్ద మైనస్. ఇంటెన్స్ థ్రిల్లర్ అయిన “వెంకటాపురం” సినిమా హీరో ఫేస్ లోనే ఇంటెన్సిటీ కనపడకపోవడంతో ఇంక ఆడియన్స్ సినిమాకి ఎక్కడ కనెక్ట్ అవుతారు. సో రాహుల్ అర్జెంట్ గా సిక్స్ ప్యాక్ బాడీ మీదకంటే ఎక్స్ ప్రెషన్స్ మీద వర్కవుట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. హీరోయిన్ మహిమా మక్వానా సినిమాకి మెయిన్ పిల్లర్ లా నిలిచింది. కథ మొత్తం నడిచేది అమ్మడి చుట్టూనే అవ్వడం, సన్నివేశానికి తగ్గట్లు అమ్మడు అద్భుతమైన హావభావాలు, చలాకీ నవ్వులతో ఆకట్టుకోవడం సినిమాకి ప్లస్ అయ్యింది. నటిగా చాలా సీనియర్ అయిన మహిమా చాలా సన్నివేశాల్లో రాహుల్ ను డామినేట్ చేసేసింది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్ లో మహిమా నటన అభినందనీయం.

అజయ్ ఘోష్ క్యారెక్టరైజేషన్ లో కంటిన్యూటీ లేకపోయినా.. విలనిజాన్ని మాత్రం బాగా ఎలివేట్ చేశాడు. కాకపోతే.. ఒక నటుడిగా అజయ్ ఘోష్ ను దర్శకుడు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు. అజయ్ ఘోష్ పాత్రను ఇంకాస్త హైలైట్ చేసి ఉంటే సినిమాలో మరింత ఇంపాక్ట్ ఉండేది. అజయ్ ఈ సినిమాలో పాజిటివ్ క్యారెక్టర్ లో కనిపించాడు. అయితే.. సరైన జస్టిఫికేషన్ లేని కారణంగా అతడి పాత్రకు ప్రాముఖ్యత లభించలేదు.

సాంకేతికవర్గం పనితీరు : సినిమాటోగ్రఫీ, సంగీతం సినిమాకి మెయిన్ ఎస్సెట్స్. అచ్చు సమకూర్చిన పాటలు, నేపధ్య సంగీతం బాగున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ తో సన్నివేశంలోని ఎమోషన్ ను ఎలివేట్ చేసిన విధానం బాగుంది. అలాగే సినిమాటోగ్రాఫర్ సాయిప్రకాష్ పరిమిత వనరులతో మంచి ఔట్ పుట్ ను అందించాడు. స్లోమోషన్ షాట్స్, డ్రోన్ కెమెరాతో తీసిన లాంగ్ షాట్స్ బాగున్నాయి. అయితే.. బడ్జెట్ పరిమితుల కారణంగా సినిమా మొత్తం రిపీటెడ్ లొకేషన్స్ లో షూట్ చేయడం వల్ల ప్రేక్షకుడికి కొత్త అనుభూతి కలగదు. ఎడిటింగ్ ఈ సినిమాకి మైనస్ గా మారింది. చాలా చోట్ల సన్నివేశాలు కనెక్ట్ అవ్వలేదు. ఇంకొన్ని చోట్ల జర్క్స్ ఎక్కువయ్యాయి. ఈ కారణంగా ప్రేక్షకుడు పూర్తి స్థాయిలో సినిమాలో లీనమవ్వలేడు.

దర్శకుడు వేణు రాసుకొన్న కథలో ఉన్న కొత్తదనం, ఆ కథను ప్రెజంట్ చేయడంలో కనిపించలేదు. అనవసరమైన సన్నివేశాలతో ఫస్టాఫ్ లో బోర్ కొట్టించాడు. సెకండాఫ్ లో కథలోని ఇంటర్ లింక్స్ ను కనెక్ట్ చేసిన విధానం బాగున్నా.. అక్కడ ఎమోషన్ సింక్ అవ్వలేదు. ఎండ్ క్రెడిట్ సీన్స్ యాడ్ చేయాలన్న ఆలోచన బానే ఉంది కానీ.. ఆ సన్నివేశాలతో సినిమాలోని ఏదైనా పాయింట్ ను రైజ్ చేస్తే బాగుండేది. ఓవరాల్ గా ప్రేక్షకుడ్ని ట్రైలర్, పోస్టర్స్ తో ఎగ్జయిట్ చేసిన స్థాయిలో సినిమా లేదు. అయితే.. ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా సినిమా చూసే ప్రేక్షకులు మాత్రం “పర్లేదు” అనుకొనేలా ఉంది “వెంకటాపురం”.

విశ్లేషణ : “వెంకటాపురం” లాంటి సినిమాలకు కావాల్సింది కథనంలో సస్పెన్స్. ఆ సస్పెన్స్ ను చివరివరకూ మెయింటైన్ చేయగల కథ. కానీ ఈ సినిమాలో ఆ రెండు ఉండాల్సిన స్థాయిలో లేవు. ఆ కారణంగా “వెంకటాపురం” మరో శుక్రవారం సినిమాగా మిగిలిపోయింది!

రేటింగ్ : 1.5/5

Click Here For ENGLISH Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus