వెంకటేష్ ‘విక్టరీ’లో రీమేక్ లది కీలక పాత్ర. ఇతర భాషల సినిమాలు రీమేక్ చేసిన తెలుగు హీరోల్లో వెంకీది ఓ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. కెరీర్ తొలినాళ్లలో చేసిన “భారతంలో అర్జునుడు” నుండి మొన్నటి “గోపాల గోపాల” వరకు ఎక్కడా రీమేక్ లపై ఆయన చిన్న చూపు చూసింది లేదు. ఒకటి రెండు సార్లు తప్పితే వాటిపై ఆయన నమ్మకం ఎప్పుడూ వమ్ము కాలేదు. ఆ నమ్మకంతోనే వెంకీ ఇటీవల మరో రీమేక్ కి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.సుధా కొంగర తెరకెక్కించిన ద్విభాషా చిత్రం “ఇరుది సుట్రు/ సాలా ఖాడూస్” రీమేక్ లో వెంకటేష్ నటిస్తున్నట్టు ఇటీవల అధికారిక ప్రకటన వచ్చింది.
తాజగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి ఇటు పరిశ్రమ వర్గాలు, అటు ప్రేక్షకులు ముక్త కంఠంతో అదిరింది ‘గురు’ అంటున్నారు. బాబు బంగారంలో క్లాస్ లుక్ తో కనిపించిన వెంకటేష్ బాక్సింగ్ కోచ్ గా రగ్డ్ లుక్ లో దర్శనమిచ్చి ‘వహ్వా’ అనిపించారు. ‘పిజ్జా’, ‘కబాలి’ వంటి అనువాద సినిమాలతో తెలుగు వారికి పరిచయమైన సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ తెలుగులో ఇదే తొలి చిత్రం. కృష్ణ భగవాన్ ప్రధాన పాత్రలో ‘ఆంధ్ర అందగాడు’ (2008) సినిమా చేసిన సుధా కొంగరకు దర్శకురాలికి తెలుగులో ఇది రెండో చిత్రం. తమిళం, హిందీ భాషల్లో విజయం సాధించిన ఈ సినిమాతో వెంకీ మరో హిట్ కొట్టడం ఖాయం అని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.