అవసరాల వెంకీ కాంబినేషన్

దర్శకుడిగా చేసింది రెండు సినిమాలే అయినా బోలెడంత పేరు తెచ్చుకున్నాడు అవసరాల శ్రీనివాస్. ఇప్పటివరకు కనపడిన తనలోని నటుడికి పడిన మార్కుల కంటే దర్శకుడిగానే ఎక్కువ మార్కులు కొట్టేశాడు శ్రీని. హాస్యనటుడిగా పేరొందాడు గనక హాస్యం పండించి హిట్ కొట్టాడులే అనుకున్న వారికి ‘జ్యో అచ్యుతానంద’ సమాధానమిచ్చింది. దాంతో ఇతగాడి ప్రతిభపై పరిశ్రమకి భరోసా కలిగింది.

ప్రయత్నాల్లో పడిన కష్టాల మాట ఎలా ఉన్నా హిట్ పడితే ఎవరైనా ‘అందరి బంధువే’ అన్న చందాన శ్రీనికి నిర్మాతల తాకిడి బాగానే ఉందట. మిగిలిన వారి మాట ఎలా ఉన్నా సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకీ తో ఓ సినిమా చేయాలనీ నిర్మాతలు ఎస్.రాధాకృష్ణ (చినబాబు), నాగవంశీ శ్రీనిని సంప్రదించారట. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సినిమాల్లా ఓ వినోద భరిత చిత్రమైతే బాగుండని చూచాయగా తెలిపారట. అయితే శ్రీని ప్రస్తుతం ‘హంటర్’ రీమేక్ సహా మరికొన్ని సినిమాలతో నటుడిగా బిజీగా ఉన్నాడు. తర్వాత నాని హీరోగా సాయి కొర్రపాటితోనే సినిమా చేస్తున్నట్టు శ్రీని ఎప్పుడో ప్రకటించాడు. ఇవన్నీ ఓ కొలిక్కి వస్తే తప్ప వెంకీ-శ్రీని కాంబినేషన్ లో సినిమా విషయం తేలదు. అటు వెంకీ కూడా వేగం పెంచి పలు సినిమాలతో బిజీ అయిపోయారు. అయితే కాస్త ఆలస్యమైనా వెంకీ-శ్రీని కలవడం పక్కా అని పరిశ్రమ వర్గాల గుసగుసలు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus