అమ్మానాన్నలు సినిమా టికెట్లకి డబ్బులిస్తే.. అంకుల్-ఆంటీ సినిమా తీయడానికి డబ్బులిచ్చారు!! : వెంకీ కుడుముల

  • July 8, 2020 / 12:04 PM IST

“తేజ, యోగి, త్రివిక్రమ్ ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన నా మీద వారి ప్రభావం ఉండకుండా చాలా జాగ్రత్తపడ్డాను. నాకు నాగశౌర్యతో ఉన్న స్నేహబంధం మంచి ఔట్ పుట్ రావడంలో బాగా ఉపయోగపడింది. ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను భావించడమే కాక నాకు దర్శకుడిగా అవకాశమిచ్చిన నాగశౌర్య తల్లిదండ్రులకు జీవితాంతం ఋణపడి ఉంటాను” అంటున్నాడు యువ దర్శకుడు వెంకీ కుడుముల. ఆయన దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం “ఛలో”. నాగశౌర్య, రష్మిక మండన్నా జంటగా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ తన ప్రయాణాన్ని మీడియాతో ముచ్చటించాడు..!!

బలభద్రపాత్రుని రమణిగారి దగ్గర జర్నీ మొదలైంది..
నేను పుట్టిపెరిగింది మొత్తం ఖమ్మంలోనే. గ్రాడ్యుయేషన్ కోసం హైద్రాబాద్ వచ్చాను. చిన్నప్పట్నుంచి నవలలంటే పిచ్చి, ఆ పిచ్చే నన్ను బలభద్రపాత్రుని రమణి గారి దగ్గరకి చేర్చింది. అక్కడ తేజగారు నన్ను గమనించి ఆయన తీసిన “నీకు నాకు డ్యాష్ డ్యాష్” సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టుకొన్నారు. ఆ తర్వాత యోగి గారి దగ్గర “జాదూగాడు” చిత్రానికి వర్క్ చేశాను. అనంతరం త్రివిక్రమ్ గారి దగ్గర “అ ఆ” సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను.

త్రివిక్రమ్ గారి సపోర్ట్ మరువలేనిది..
త్రివిక్రమ్ గారు సెట్ లో ఎంత బిజీగా ఉన్నా.. అక్కడ సరిగ్గా పనిచేసేవారి మీద ఆయన ధ్యాస తప్పకుండా ఉంటుంది. అలా నేను ఆయన దృష్టిలో పడ్డాను. షూటింగ్ టైమ్ లో చాలా ఎంకరేజ్ చేసేవారు. సినిమా అయిపోయాక “అజ్ణాతవాసి” ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా.. “నువ్ నెక్స్ట్ డైరెక్టర్ అవ్వడమే మంచిది” అని సూచించారు. దర్శకుడిగా నా ఎదుగుదలలో ఆయన ప్రోద్భలం చాలా ఉంది.

నేను ఇబ్బందిపడుతుంటే శౌర్య అడిగాడు..
“జాదూగాడు” సినిమాకి వర్క్ చేస్తున్నప్పట్నుంచి శౌర్యతో పరిచయం ఉంది. ఆ తర్వాత పరిచయం స్నేహంగా మారింది. వాళ్ళ ఇంట్లో కూడా నన్ను ఒక కొడుకుగానే చూసేవారు. “అ ఆ” సినిమా అయిపోయాక డైరెక్టర్ గా చేద్దామనుకొంటున్న తరుణంలో ముందుగా నా మైండ్ లోకి వచ్చిన మొదటి హీరో శౌర్య. అయితే.. అడిగితే ఏదో ఫ్రెండ్ షిప్ ని అడ్డుపెట్టుకొని అడుగుతున్నాడను అనుకొంటారేమో అని భయపడి అడగలేదు. తర్వాత శౌర్య తానే స్వయంగా సినిమా చేద్దాం వెంకీ మంచి స్టోరీ రెడీ చెయ్ అని చెప్పడంతో నాకు భలే సంతోషం అనిపించింది.

“ఛలో” కథ మా ఊర్లోనే పుట్టింది..
మా ఊరు తెలంగాణ-ఆంధ్ర విడిపోయినప్పుడు సరిగ్గా బోర్డర్ లో ఉండిపోయింది. రెండు కిలోమీటర్లు వెళితే ఆంధ్రా బోర్డర్ వచ్చేది. అప్పుడే “ఛలో” కథ పుట్టింది. నిజానికి ముందు శౌర్యతో ఒక క్రైమ్ కామెడీ అనుకొన్నాను కానీ శౌర్యకి ఆ కథ నచ్చలేదు. అప్పుడు “ఛలో” చెబితే వెంటనే ఒకే చేశాడు. అయితే.. బోర్డర్ అనేది ఎవరి మనోభావాలను కించపరిచే విధంగా ఉండదు, చాలా హుందాగా ఉంటుంది.

నా మీద అభిమానం, శౌర్య మీద ప్రేమ కలగలిసి..
“ఛలో” కథ శౌర్యకి విపరీతంగా నచ్చేసి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాడు. వాళ్ళకి కూడా కథ విపరీతంగా నచ్చేయడంతో “ఈ కథ వేరే ప్రొడ్యూసర్స్ అయితే వెంకీ పూర్తి స్వేచ్చతో తీయగలడో లేడో?” అనే సందేహంతోపాటు శౌర్యకి కూడా మంచి హిట్ అవసరం కాబట్టి మేమే ప్రొడ్యూస్ చేయాలనుకొన్నారు. ఆ విధంగా “ఛలో” సినిమా ఐరా క్రియేషన్స్ కి పునాది వేసింది.

శౌర్య నేను ఒకేలా ఆలోచిస్తాం..
స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాక ప్యాచ్ వర్క్ కోసం చెన్నై వెళ్లినప్పుడు కన్నడ “కిరిక్ పార్టీ” చూశాను. ఆ సినిమాలో రష్మికను చూసి ఈ అమ్మాయి మా సినిమాలో హీరోయిన్ అయితే బాగుండు అని థియేటర్ నుంచి బయటకొస్తుండగా.. అదే సమయంలో శౌర్య నాకు కాల్ చేసి ఒకమ్మాయిని చూశాను మన సినిమాకి సరిపోతుంది అని చెప్పి “కిరిక్ పార్టీ”లోదే ఒక వీడియో సాంగ్ పంపించాడు. “ఏంట్రా బాబు ఇద్దరం ఒకేలా ఆలోచిస్తున్నాం” అనుకొన్నాను. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ మహతి విషయంలోనూ అలాగే జరిగింది.

ఎవరి ప్రభావం ఉండకూడనుకొన్నాను..
నేను పని చేసింది ‘తేజ, యోగి, త్రివిక్రమ్” గార్లవద్ద అయినప్పటికీ టేకింగ్ పరంగా నామీద పూరీ జగన్నాధ్ గారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే “అమ్మానాన్న తమిళమ్మాయి” టైమ్ నుంచి నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ ని. అయితే.. ఏ ఒక్కరి ప్రభావం నా మీద ఉండకుండా నాకంటూ ప్రత్యేకమైన పంధా ఉండాలని చాలా ప్రయత్నించాను.

ఈ రేంజ్ పబ్లిసిటీ-బజ్ అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదు..
నా ఆలోచన ఎంతసేపూ సినిమా బాగా రావాలనే తప్పితే వేరే విషయాల గురించి ఆలోచించేవాడ్ని కాదు. అయితే.. టీజర్ మొదలుకొని మొన్న జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ వరకూ అన్నీ సినిమా మీద అంచనాలను పెంచేశాయి. అయిదే అదంతా మా నిర్మాతలు తీసుకొన్న స్పెషల్ కేర్ వల్లే సాధ్యమైంది. కానీ నిజంగానే ఈస్థాయి పాజిటివ్ బజ్ మాత్రం ఎక్స్ పెక్ట్ చేయలేదు.

సక్సెస్ క్రెడిట్ అందరిదీ..
“ఛలో” సూపర్ హిట్ అయితే.. ఆ క్రెడిట్ మా హీరో శౌర్య, ప్రొడ్యూసర్స్, కెమెరామెన్, ప్రొడక్షన్ టీం ఇలా అందరిదీ అవుతుంది. ఎందుకంటే అందరూ సినిమా కోసం కష్టపడినవాళ్ళమే. అయితే.. ఆడియన్స్ మా చిత్రాన్ని ఏమేరకు ఆదరిస్తారనేది ఇంకో రెండ్రోజుల్లో తెలిసిపోతుంది.

– Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus