సౌత్ సినిమా స్థాయిని పెంచి, ఆస్కార్ రేంజ్ కి తీసుకెళ్లిన చిత్రం “విశారనై”. వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ రియలిస్టిక్ డ్రామా 2016లో తమిళంలో విడుదలవ్వగా.. దాదాపు మూడేళ్ళ క్రితం విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులో “విచారణ” అనే పేరుతో అనువదించి ఇవాళ విడుదల చేశారు. తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం తెలుగువారిని ఏమేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం..!
కథ: పాండు (దినేష్ రవి) గుంటూరులో కూలి పని చేసుకొని బ్రతికే ఓ సగటు యువకుడు. ఒకానొక సందర్భంలో కొందరు పోలీసులు వచ్చి పాండుతోపాటు మరికొంత మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. అసలు ఏం జరుగుతుందో తెలిసేలోపు తాము ఒక హత్య కేసులో ఇరీంచబడ్డామని తెలుసుకొని షాక్ అవుతారు పాండు & ఫ్రెండ్స్. పాండుతోపాటు మిగతావాళ్లని కూడా ఆ హత్య తామే చేసినట్లు ఒప్పుకోమని బలవంతపెట్టడమే కాక చిత్రహింసలకు గురి చేస్తుంటారు పోలీసులు. ఆ సమయంలో పాండుకు పోలీస్ స్టేషన్ లోనే పరిచయమవుతాడు ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి (సముద్రఖని).
అతడి సహాయంతో తమపై పడ్డ అబద్ధపు కేసు నుంచి తప్పించుకోవాలనుకుంటారు పాండు & ఫ్రెండ్స్. మరి వాళ్ళ ప్లాన్ ఫలించిందా? తాము చేయని తప్పు నుంచి తప్పించుకోగలిగారా? లేదా? అనేది “విచారణ” కథాంశం.
నటీనటుల పనితీరు : ఒకరు బాగా నటించారు, ఒకరు నటించలేదు అని లేదు.. ప్రతి ఒక్కరూ వారి వారి పాత్రల్లో జీవించారు. ముఖ్యంగా.. పోలీస్ గా అజయ్ ఘోష్ నటన చూస్తుంటే కనబడితే కొట్టాలన్నంత కోపం వస్తుంది. ఒక నటుడిగా ఆయన ఏస్థాయిలో పాత్రను రంజింపజేశాడు అనేందుకు ఉదాహరణ అది. ఇక రెండు వేరియేషన్స్ ఉన్న పోలీస్ పాత్రలో సముద్రఖని నటన సినిమాకి హైలైట్. అలాగే బాధితులుగా నటించిన దినేష్ రవి, కిషోర్, ఆడుకాలం మురుగదాస్ లు అద్భుతంగా నటించారు. చిన్న పాత్రే అయినప్పటిఈ ఆనంది (బస్టాప్ ఫేమ్) కూడా చక్కగా నటించింది.
సాంకేతికవర్గం పనితీరు: ఇప్పటివరకూ పోలీస్ వ్యవస్థ ప్రధానాంశంగా వచ్చిన సినిమాల్లో పోలీసుల కష్టాలు లేదా వారు ఎదుర్కొనే ఇబ్బందులు, పైనుంచి పడే ప్రెజర్ ను మాత్రమే చూపించారు. కానీ “విచారణ” చిత్రంలో మాత్రం పోలీస్ వ్యవస్థలోని లొసుగులు, కొన్ని కేసులను మూసేయడం కోసం వాళ్ళు వేసే దొంగ ఎత్తులు, అమాయకులను కేసుల్లో ఇరికించడం కోసం వాళ్ళు అమాయకులను ఎలా చిత్రహింసలు పెడుతుంటారు, అసలు వాళ్ళు ఇంటరాగేషన్ చేసే విధానం ఎలా ఉంటుంది అనేది దర్శకుడు వెట్రిమారన్ చాలా సహజంగా, ఇంకా చెప్పాలంటే పచ్చిగా చూపించాడు. కొన్ని చోట్ల కాస్త శ్రుతిమించినట్లుగా అనిపించినా.. ఆమాత్రం ఉండాలిలే అనిపిస్తుంది.
ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ రావడంలో తప్పులేదు అనిపించకమానదు. కాకపోతే.. డబ్బింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. కొన్ని వాయిస్ లు బాడీలకు అస్సలు సింక్ అవ్వలేదు. అలాగే.. కొన్ని బూతులను కూడా సెన్సార్ చేయాలి. లేకపోతే సినిమా చూడడానికి కొందరు ఇబ్బందిపడాల్సి వస్తుంది.
కెమెరా వర్క్, డి.ఐ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. కెమెరా ఫ్రేమ్స్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. నేపధ్య సంగీతం కూడా బాగుంది. అన్నిటికీ మించి దర్శకుడు ఎలాంటి అనవసరమైన కమర్షియాలిటీకి లొంగకుండా కథను కాస్త గట్టిగా నమ్ముకొని కథనాన్ని రాసుకొన్న విధానం ప్రేక్షకుల్ని చివరివరకు కట్టిపడేస్తుంది.
విశ్లేషణ : కమర్షియాలిటీకి దూరంగా.. సహజమైన సినిమాలు చూద్దామనుకొనే ప్రేక్షకులకి “విచారణ” ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్. కాకపోతే.. సున్నిత మానస్కులు, హింసను ఎక్కువగా చూడలేనివారు ఈ సినిమాకి దూరంగా ఉండడం మంచిది. కానీ.. సినిమాలో పోలీసు వ్యవస్థలోని మరో కోణాన్ని చాలా పచ్చిగా తెరకెక్కించిన విధానం మాత్రం భయం పుట్టిస్తుంది.