సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన “మహానటి” బయోపిక్ ఆర్ధికంగా విజయం సాధించడంతో బయోపిక్ లపై నమ్మకం పెరిగింది. అందుకే తమిళ ప్రజల గుండెల్లో “అమ్మ”గా ముద్ర వేసుకున్న జయలలిత జీవితం వెండితెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని నిర్మిస్తున్న విబ్రి మీడియా బ్యానర్ వారు జయలలిత బయోపిక్‌ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించడానికి సిద్ధమయ్యారు. ‘మదరాసు పట్టణం’ చిత్రంతో దర్శకుడిగా పలు అవార్డులు అందుకున్న విజయ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ‘‘ఒక సాధారణ రాజకీయ నేత నుంచి రాజకీయ శక్తిగా మారిన మహిళల్లో జయలలిత ఒకరు. భారత రాజకీయాల్లో ఆమె ప్రస్థానం ఒక చెరగని సంతకం. ఫిబ్రవరి 24న జయలలిత పుట్టినరోజుని పురస్కరించుకుని సినిమా ప్రారంభించనున్నాం.
అదే రోజు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయనున్నాం’’ అని విబ్రి మీడియా డైరెక్టర్, బృందాప్రసాద్ అడుసుమిల్లి అన్నారు. ఇక జయలలితగా ఎవరు నటిస్తారనేది.. ఆసక్తికరంగా మారింది. స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న విజయ్ అమ్మ పాత్ర కోసం విద్యాబాలన్, కీర్తి సురేష్, నయనతార పేర్లను పరిశీలిస్తున్నారు. విద్యాబాలన్, కీర్తి సురేష్.. డర్టీ పిక్చర్, మహానటి బయోపిక్ లతో మంచి పేరు తెచ్చుకున్నారు. మూడు భాషల్లోను ఫాలోవర్స్ ఉన్నారు. వీరిద్దరిలో ఒకరికి ఒకే చెబుతారా? లేకుంటే వరుసవిజయలతో దూసుకుపోతున్న నయనతారని తీసుకుంటారా? అనేది కొన్ని రోజుల్లోనే తెలియనుంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు నిర్మాత విష్ణు ఇందూరి వెల్లడించారు.