సినిమాల్లో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఒక్కో హీరోది ఒక్కో స్టైల్. నిజజీవితంలోను సమస్యలో ఉన్నవారిని ఆదుకోవడంలోను అదే విధానాన్ని ఫాలో అవుతుంటారు. కొంతమంది చిన్నపిల్లల, వైద్య విద్యకి ధన సహాయం చేస్తే.. మరికొంతమంది గ్రామాలను దత్తతతీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. ఈ విధంగా ఎలా వీలుంటే అలా.. ఆపదలో ఉన్న వారికీ దేవుళ్లుగా హీరోలు మారుతున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట బాధితులకు అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నారు. తమిళనాడులో తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాటం తారాస్థాయికి చేరుకుంది. కమల్‌హాసన్, రజినీకాంత్, విజయ్ సేతుపతి వంటి ప్రముఖ నటులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. తాజాగా స్టార్ హీరో విజయ్ కూడా తూత్తుకుడి వచ్చారు.
అయితే ఎలాంటి హడావిడీ లేకుండా వచ్చి అంతే సైలెంట్‌గా వెళ్లిపోయారు. మంగళవారం రాత్రి బైక్‌పై విజయ్ తూత్తుకుడి చేరుకుని… బాధిత కుటుంబాలతో మాట్లాడి వారికి లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించారు. మళ్లీ బైక్‌పైనే చెన్నై వెళ్లిపోయారు. తూత్తుకుడిలో విజయ్ బైక్‌పై తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయ్ రియల్ హీరో అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంతసాయానికే మీడియాలో హడావుడి చేసే వారు విజయ్ ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతోఉందని చురకలు అంటిస్తున్నారు.