కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు, చేతిలో వందల కోట్ల మార్కెట్ ఉన్నప్పుడు ‘సినిమాలు మానేస్తున్నా’ అని చెప్పడానికి గట్స్ కావాలి. విజయ్ ఇప్పుడు అదే చేశారు. ‘జన నాయగన్’ తన ఆఖరి చిత్రమని ఆడియో ఫంక్షన్ లో తేల్చి చెప్పారు. కానీ చరిత్ర చూస్తే.. రాజకీయాల్లోకి వెళ్ళిన ఏ స్టార్ హీరో కూడా సినిమా రంగును శాశ్వతంగా వదులుకోలేదు. మరి విజయ్ మాత్రం ఇందుకు మినహాయింపు అవుతారా? అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న.
Vijay
తెలుగులో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు, పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల సమయంలోనూ ఇలాంటి ప్రకటనే చేశారు. కానీ రాజకీయ చదరంగంలో ఆశించిన ఫలితాలు రానప్పుడు, మళ్ళీ ముఖానికి రంగు వేసుకోక తప్పలేదు. ఈ ‘టాలీవుడ్ సెంటిమెంట్’ చూసి, విజయ్ కూడా ఎన్నికల తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వస్తారని చాలామంది ఫిక్స్ అయిపోతున్నారు. అయితే ఇక్కడే ఒక చిన్న లాజిక్ ఉంది. ఆంధ్రాలో ఉన్నట్టు తమిళనాడులో బలమైన నాయకత్వం ప్రస్తుతం లేదు.
జయలలిత, కరుణానిధి లాంటి ఉద్దండులు లేని ఆ ‘పొలిటికల్ గ్యాప్’ విజయ్ కి పెద్ద ప్లస్ పాయింట్. అక్కడ జనం ఒక బలమైన ముఖం కోసం చూస్తున్నారు. ఈ టైమ్ లో విజయ్ గనక అక్కడ క్లిక్ అయితే, ఆయన మళ్ళీ సినిమాల వైపు చూసే ప్రసక్తే ఉండదు. ఒకవేళ అక్కడ లెక్కలు తేడా కొడితే మాత్రం, చిరు పవన్ బాటలోనే రీఎంట్రీ ఖాయం.
అంటే విజయ్ సినిమా కెరీర్ అయిపోయిందా లేదా అనేది ఆయన చేతిలో లేదు, తమిళ ఓటర్ల చేతిలో ఉంది. రాబోయే ఎన్నికల ఫలితాలే ఆయన మళ్ళీ షూటింగ్ స్పాట్ కి వస్తారా లేక అసెంబ్లీ గేట్ దాటుతారా అనేది డిసైడ్ చేస్తాయి. ఇక జన నాయగన్ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి సినిమా ఆయన పొలిటికల్ కెరీర్ కి ఎలాంటి బూస్ట్ ని ఇస్తుందో చూడాలి.