విజేత

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ను హీరోగా పరిచయం చేస్తూ వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రం “విజేత”. రాకేష్ శశి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో మురళీశర్మ కీలకపాత్ర పోషించారు. ఫాదర్ సెంటిమెంట్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన 10వ హీరో అయిన కళ్యాణ్ దేవ్ ను కథానాయకుడిగా నిలబెట్టిందా? లేదా? అనేది తెలుసుకొందాం.

కథ : రామ్ (కళ్యాణ్ దేవ్)ను చిన్నప్పట్నుంచి అల్లారు ముద్దుగా పెంచుకొంటాడు తండ్రి శ్రీనివాస్ (మురళీ శర్మ). పెద్దయ్యాక బాధ్యతగా వ్యవహరించకుండా జులాయిగా తిరుగుతుంటాడు. కానీ.. దొరికిన ఉద్యోగం చేయడం కంటే మనసుకి నచ్చిన పని చేయమని ప్రోత్సహించే తండ్రి ఏనాడూ కొడుకుని ఒక్క మాట కూడా అనడు. కానీ.. ఒకానొక సందర్భంలో కొడుకు పిల్ల చేష్టల కారణంగా పోలీస్ స్టేషన్ లో అందరి ముందు ఘోరమైన అవమానాన్ని భరించాల్సి వస్తుంది. ఆ అవమానం తండ్రీకొడుకుల నడుమ దూరాన్ని పెంచకపోయినా.. తన కారణంగా తనను అపురూపంగా పెంచిన తండ్రి అవమానం పడడం సహించలేకపోయిన కొడుకులో మంచి మార్పును తీసుకొస్తుంది.

జులాయి పనులు మాని మనసుకి నచ్చిన పని చేస్తూ.. జీవితంలో తాను విజేతగా నిలవడమే కాక తన తండ్రి కుటుంబం కోసం పక్కన పెట్టేసిన ఫోటోగ్రఫీని మళ్ళీ ప్రోత్సహించి తండ్రిని కూడా విజేతను చేస్తాడు. ఇదీ “విజేత” సినిమా కథ. భారీ ట్విస్టులు, అనవసరమైన ప్రయాసలు లేకుండా సింపుల్ గా ఉండడం వలన ఇలా కథను పూర్తిగా వివరించడం జరిగిందే తప్ప.. కింద కామెంట్ బాక్స్ లో “కథ మొత్తం ఎందుకు చెప్పుసావురా?” అంటూ కామెంట్స్ పోస్ట్ చేయడానికి కాదు.

నటీనటుల పనితీరు : కళ్యాణ్ దేవ్ ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ, హావభావాల ప్రకటన విషయంలో ఇంకా కసరత్తులు చేయాల్సిన అవసరం ఉంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్ని తమ నటచాతుర్యంతో కట్టిపడేస్తున్న ఆర్టిస్టులు ప్రతి కొత్త సినిమాతో పరిచయమవుతున్న ఈ తరుణంలో కళ్యాణ్ కేవలం మెగా ఫ్యామిలీ బ్యాకప్ తో ఎక్కువకాలం నెట్టుకురాలేడు. ముఖ్యంగా వాయిస్ మాడ్యులేషన్ పై బాగా కాన్సన్ ట్రేట్ చేయాలి, లేకుండా హీరోగా నిలదొక్కుకోవడం కష్టమే. సినిమాలో తండ్రి పాత్రలో మురళీ శర్మ వందకి వంద మార్కులు సంపాదించడమే కాదు.. సినిమాకి నిజమైన హీరోలా నిలిచాడు. ఆయన పలికించిన ఎమోషన్స్ కి ప్రేక్షకుల కంట కన్నీరు రాకపోయినా.. బాగానే కనెక్ట్ అవుతారు.

“ఎవడే సుబ్రమణ్యం?, కళ్యాణ వైభోగమే” చిత్రాలతో నటిగా ప్రేక్షకుల్ని విశేషమైన రీతిలో ఆకట్టుకొన్న మాళవికా నాయర్ పాత్రకు ఈ చిత్రంలో ఓపెనింగ్ లో ఉన్నంత వేల్యూ కానీ ఎలివేషన్ కానీ తర్వాతర్వాత లోపించింది. ఇక చివరికి ఆమె పాత్ర కేవలం బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ కి పడిపోవడం గమనార్హం. సుదర్శన్, నోయెల్, మహేష్ విత్తల కామెడీ ఓ మోస్తరుగా ఉంది.

సాంకేతికవర్గం పనితీరు : దర్శకుడు రాకేష్ శశి కథను రాసుకొన్న విధానం బాగుంది. జనరల్ గా సినిమాల్లో టైటిల్ హీరో క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ లా ఉంటుంది. కానీ.. ఈ సినిమాలో తండ్రి పాత్రను ఎలివేట్ చేయడం అనేది ప్రేక్షకుల్ని ఆకట్టుకొనే ప్రధానాంశం. అయితే.. స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం చాలా తడబడ్డాడు. ఇంటర్వెల్ బ్లాక్ చాలా చక్కగా, హృద్యంగా రాసుకొన్న రాకేష్ సెకండాఫ్ లో అనవసరమైన కామెడీ సీన్లు, ఎమోషన్స్ జొప్పించడానికి చేసిన ప్రయత్నం కాస్త బెడిసికొట్టింది. ముఖ్యంగా 122 నిమిషాల సినిమాలో ల్యాగ్ ఉండడం అనేది చాలా పెద్ద తప్పు. తక్కువ రన్ టైమ్ లో ఒక మంచి సినిమా చూశాం అనే భావనతో ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకి వెళ్ళాలి కానీ.. అసంతృప్తితో కాదు. ఆ విషయంలో జాగ్రత్త తీసుకొని ఉంటే “విజేత” ఒక మంచి సినిమాగా మిగిలిపోయేది.

హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం, సెంథిల్ కెమెరా, సాయి కొర్రపాటి ప్రొడక్షన్ వేల్యూస్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి.

విశ్లేషణ : “విజేత’ ఒక మంచి ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్. కానీ.. కథానాయకుడి నటన, స్క్రీన్ ప్లే వంటి మైనస్ పాయింట్స్ కారణంగా సినిమాలోని ఎమోషన్ ను ప్రేక్షకుడు ఫీల్ అవ్వలేడు. ఆ కారణంగా ఒక మంచి ప్రయత్నంగా ఈ సినిమా మిగిలిపోతుంది.

రేటింగ్ : 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus