కప్పుడు మన ప్రొడ్యూసర్లకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఏటీఎం మెషీన్లలా పనిచేశాయి. హీరో డేట్లు లాక్ అవ్వగానే, “మాకు రైట్స్ కావాలి” అంటూ ఓటీటీ కంపెనీలు క్యూ కట్టేవి. సినిమా ఎలా ఉందో కూడా చూడకుండా, కేవలం స్టార్ పవర్‌ను చూసి వందల కోట్లు కుమ్మరించేవి. “టేబుల్ ప్రాఫిట్” అనేది చాలా ఈజీగా ఉండేది. కానీ, ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది.
కోవిడ్ టైమ్‌లో, ఆ తర్వాత కొన్ని భారీ బడ్జెట్ ఫ్లాపులను కొని, చేతులు కాల్చుకున్న ఓటీటీలు ఇప్పుడు చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తున్నాయి. “స్టార్ ఎవరా అని కాదు, కంటెంట్ ఏంటి? మీ హీరో ఫామ్ ఎలా ఉంది?” అని ప్రతీ లెక్కా చూస్తున్నారు. ఈ కొత్త రూల్స్ దెబ్బ ఇప్పుడు టాలీవుడ్‌లోని ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్‌కు గట్టిగా తగులుతోంది. వాళ్లే ప్రభాస్, చిరంజీవి.
2026 సంక్రాంతికి ఈ ఇద్దరు స్టార్స్ బాక్సాఫీస్ దగ్గర ఢీ కొట్టడానికి రెడీ అవుతున్నారు. ప్రభాస్ ‘రాజా సాబ్’తో, చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’తో వస్తున్నారు. ఈ రెండు సినిమాల థియేట్రికల్ బిజినెస్ రేట్లు హై రేంజ్ లోనే ఉన్నాయి, రికార్డు రేట్లకు డీల్స్ క్లోజ్ అవుతున్నాయి. కానీ, ప్రొడ్యూసర్‌కు అసలైన ‘సేఫ్టీ’ ఇచ్చే డిజిటల్ రైట్స్ (ఓటీటీ) డీల్స్ మాత్రం ఇప్పటికీ క్లోజ్ అవ్వలేదు.
చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాకు ఫుల్ పాజిటివ్ బజ్ ఉంది. ఈ బజ్‌ను నమ్మి, మేకర్స్ ఓటీటీ రైట్స్ కోసం మైండ్ బ్లాంక్ అయ్యే రేటు కోట్ చేశారట. దీంతో, ‘జీ స్టూడియోస్’ లాంటి పెద్ద సంస్థ కూడా “ఈ రేటుకు మా వల్ల కాదు” అని చెప్పి, కేవలం శాటిలైట్ రైట్స్ మాత్రమే తీసుకుని సైడ్ అయిపోయిందట. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌తో ఫైనల్ స్టేజ్ చర్చలు నడుస్తున్నాయి. ఈ ఒక్క డీల్ సెట్ అయితే చాలు, సినిమా రిలీజ్‌కు ముందే ప్రొడ్యూసర్లకు పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి.
ఇక ప్రభాస్ ‘రాజా సాబ్’ పరిస్థితి దీనికి కొంచెం భిన్నంగా ఉంది. ‘సలార్’ హిట్ అయినా, ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’ ఫ్లాపుల ఎఫెక్ట్ ఇంకా ప్రభాస్ మార్కెట్‌పై పడుతోంది. సినిమా బడ్జెట్ భారీగా ఉంది, కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మాత్రం రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నాయి. ప్రొడ్యూసర్ అడిగే రేటుకు, వాళ్లు ఆఫర్ చేసే రేటుకు మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉందట. వాళ్లు “మీరు అడిగినంత ఇవ్వలేం” అని గట్టిగా బేరం ఆడుతున్నట్లు టాక్.
రిలీజ్‌కు ఇంకా మూడు నెలలే టైమ్ ఉంది. థియేటర్లలో క్లాష్ అయ్యేలోపే, ఈ రెండు పెద్ద సినిమాలు ఓటీటీల దగ్గర మంచి రేటు కోసం గట్టిగా ఫైట్ చేస్తున్నాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే, ఓటీటీల నుంచి ‘ఈజీ మనీ‘ వచ్చే రోజులు పోయాయని, కంటెంట్ ఉంటేనే కాస్ట్లీ డీల్స్ కుదురుతాయని క్లియర్‌గా అర్థమవుతోంది.